11 March, 2026 | 4:09 PM

Breaking News

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంచాలి

09-03-2026 12:00 AM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన

చుంచుపల్లి, మార్చి 8, (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన .. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆదివారం చుంచుపల్లి మండలం నందతండా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. గ్రామంలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించి శుద్ధి చేసి వినియోగించే విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామపంచాయతీ స్థాయిలో వ్యర్థాల వర్గీకరణ, సేకరణ, నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం సుజాతనగర్ మండలం సీతంపేట బంజారా గ్రామపంచాయతీలో స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామస్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో తడి వ్యర్థాలు , పొడి వ్యర్థాలు  వేర్వేరుగా వర్గీకరించి ఇవ్వడం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉండటానికి సహకరించాలని ప్రజలకు సూచించారు. వ్యర్థాలను సరైన విధంగా వేరు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమవుతుందని తెలిపారు. డిఎల్పీఓ, స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్, సంబంధిత ఎంపీడీవోలు, గ్రామ సర్పంచులు, స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు.