కిడ్నీ క్యాన్సర్ సైలెంట్ కిల్లర్
కిమ్స్ ఆసుపత్రి కొంపల్లిలో అవగాహన వాక్
వాక్‌ను ప్రారంభించిన కలెక్టర్ ప్రియాంక అల
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ఏవైనా వ్యాధులను ముందస్తుగా గుర్తించడం ద్వారానే మెరుగైన ఫలితాలు వస్తాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కిమ్స్ ఆసుపత్రి కొంపల్లి రీనల్ సైన్స్ విభా గం ఆధ్వర్యంలో గురువారం ‘అంతర్జాతీయ కిడ్నీ క్యాన్సర్’ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన వాక్ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రియాంక అల ముఖ్య అతిథిగా హాజరై వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ వ్యాధులు, క్యాన్సర్లపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. కిడ్నీ క్యాన్సర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్లలో ఒకటిగా మారుతోందని చెప్పారు. ముఖ్యంగా ధూమపానం, ఊబ కాయం, అధిక రక్తపోటు, మధుమేహం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు, కుటుంబ చరి త్ర వంటి అంశాలు కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయన్నారు.
అధిక ప్రమాదం ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుంటే ప్రారంభంలోనే వ్యాధి దశలను గుర్తించవచ్చని చెప్పారు. కన్సల్టెంట్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ శేషు మోహన్ మాట్లాడుతూ ప్రారంభ దశలో కిడ్నీ క్యాన్సర్‌కు మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, పక్క భాగంలో నిరంతర నొప్పి, పొత్తికడుపులో గడ్డ ఏర్పడటం, ఆకస్మికంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం, నిరంతర అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.
కిమ్స్‌లో ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడంతో కిడ్నీ భాగాన్ని కాపాడే అవకాశాలు పెరిగాయన్నారు. ధూమపానానికి దూరం ఉండాలని, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలని, తగినంత నీరు త్రాగాలని అన్నారు. జీవనశైలి కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ అమిష్ జే వాని, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పాపయ్య నిర్మల్, అన్ని విభాగాలకు చెందిన కన్సల్టెంట్ వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.






