19 June, 2026 | 2:43 AM

ఫూచర్ సిటీని కట్టితీరుతాం

19-06-2026 01:23 AM

ఎవరు అడ్డొచ్చినా.. ఎండ్రిన్ తాగినా

  1. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
  2. ఆక్రమణదారుల కోరలు పీకేందుకే హైడ్రా
  3. సామాన్యులకు భయం వద్దు
  4. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  5. ఎల్బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్‌లో అంతర్జాతీయ స్థాయిలో పార్కులు నిర్మిస్తామని హామీ
  6. గుర్రంగూడలో రూ.17.84 కోట్లతో అభివృద్ధి చేసిన ఎకో పార్క్ ప్రారంభం
  7. రాష్ట్రవ్యాప్తంగా రూ.35.50 కోట్ల విలువైన పర్యావరణ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం

రంగారెడ్డి/ ఎల్బీనగర్, జూన్ 18(విజయక్రాంతి): ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించి నా, ఎండ్రిన్ తాగినా, కోర్టుల్లో కేసులు వేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఫూచ ర్ సిటీని కట్టితీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. గుజరాత్ సబర్మతి, యూపీలోని గోమతి రివర్ ఫ్రంట్లను తలదన్నేలా మూసిని తీర్చిదిద్ది, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామని తేల్చిచెప్పారు.

ఆక్రమణదారుల కోరలు పీకేందుకే ‘హైడ్రా’ ఏర్పాటైందని, ఈ విషయంలో సామాన్యులకు ఎటువంటి భయం అక్కరలేదని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. - కేబీఆర్ పార్క్ తరహాలో ఎల్బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్‌లో అంతర్జాతీయ స్థాయి పార్కు లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం, హయత్నగర్ మండలం గుర్రంగూడలో రూ.17.84 కోట్లతో అభివృద్ధి చేసిన ఎకో పార్క్‌ను గురువారం ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.35.50 కోట్ల విలువైన పర్యావరణ అభివృద్ధి పనులకు కూడా శ్రీకా రం చుట్టారు. అలాగే గుర్రంగూడ ఎకో పార్క్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మొక్క నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు. అనం తరం, ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు దుస్థితి హైదరాబాద్‌కు రావద్దనే దూరదృష్టితో ముందుకు వెళ్తున్నామని సీనెం రేవంత్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మూసి పునర్జీవన ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. భవిష్యత్ తరాల కోసం 30 వేల ఎక రాల్లో కాలుష్య రహితంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని ప్రతిపాదిస్తే, కొందరు రాజకీయ నిరుద్యోగులు కడుపులో విషం పెట్టుకొని అభివృద్ధికి కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ లేని వాళ్లు కూడా ఫ్యూచర్ సిటీ రద్దు అంటుర్రు.. ప్రజలు వాళ్ల ఫ్యూచర్‌ను రద్దు చేస్తే ఒకాయన ఫామౌస్‌లో పండుకుండు.

మరొక ఆయన చెట్ల వెంట తిరుగుతున్నాడని రేవంత్‌రెడ్డి ఎద్దావా చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో హరీశ్‌రావు గెలిచేదేమీ లేదని ఎద్దేవా చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమన్నారు. గతంలో మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉండి, ఇప్పుడు అమ్ముడుపోయి ప్రాజెక్టును అడ్డుకుంటున్న నాయకు లను ఆయన నిలదీశారు.

భవిష్యత్ తరాలకు పచ్చని తెలంగాణ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వనమహోత్సవం కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు పచ్చని తెలంగాణను అందించే మహత్తర ప్రజా ఉద్యమమని అన్నారు. అటవీ భూములను పరిరక్షించడం, ఆక్రమణల నుంచి కాపాడడం, ప్రకృతి సమతుల్యతను కాపాడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో విలువైన అటవీ భూములను తిరిగి అటవీ శాఖ పరిధిలోకి తీసుకురావడం అభినందనీయమని అన్నా రు. ప్రతి మొక్కను బాధ్యతగా పెంచి, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావ రణ సమతుల్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలను పెంచుతూనే, మరోవైపు అడవులు, చెరువులు, కుంటలు, వన్యప్రాణులను పరిరక్షించే చర్యలను చేపడుతోందని వివరించారు.

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ పరస్పర విరుద్ధమైనవి కావని, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని ముం దుకు తీసుకెళ్తున్నామని అన్నారు. అటవీ శాఖ మంత్రి  కొండా సురేఖ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో పచ్చని తెలంగాణ, పర్యావరణ సమ తుల్యత సాధన కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.

ప్రకృతిని కాపాడే ప్రజా ఉద్యమం : మంత్రి కొండా సురేఖ

వనమహోత్సవం అనేది కేవలం మొక్క లు నాటే కార్యక్రమం కాదని, ఇది ప్రకృతిని కాపాడే ప్రజా ఉద్యమం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. 1950లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభు త్వం ప్రారంభించిన ఈ మహోన్నత కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో మహా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ‘ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క’ అనే పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ చైతన్యాన్ని పెంచిందన్నారు.

ఒక మొక్కను నాటడం అంటే భవిష్యత్ తరాలకు జీవనాధారాన్ని అందించడమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్, వివిధ సంస్థల చైర్మన్లు చల్లా నర్సింహారెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, చిలుక మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ సీ నారాయణరెడ్డి, అటవీ శాఖఉన్నతాధికారులు, ప్రజాప్ర తినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 కబ్జాదారుల వీపులు విమానమోతే..హైడ్రా

‘చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులను ఆక్రమించే కబ్జాదారుల కోరలు పీకేందుకే ‘హైడ్రా’ను తీసుకొచ్చాం. ఎవరైనా భూములను కబ్జా చేస్తే వారి వీపులు పగులుతాయి. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే సామాన్య ప్రజల జోలికి హైడ్రా వెళ్లదు, భయపడాల్సిన అవసరమూ లేదు’ అని సీఎం భరోసా ఇచ్చారు. వనస్థలిపురంలో ఆక్రమణకు గురైన గుడి భూములను హైడ్రా రంగంలోకి దిగి తిరిగి స్వాధీనం చేసుకుని, దేవుడికి అప్పగించిందని గుర్తుచేశారు.

ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్ ప్రజలకు తాను స్వయంగా నాయకత్వం వహించి, జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కు కంటే మిన్నగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ పార్కును అభివృద్ధి చేస్తానని సీఎంరేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఒకప్పుడు తాను కూడా దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో నివసించానని, సాయంత్రమైతే దోమల ఉధృతితో చంటిపిల్లల తల్లిదండ్రులు పడ్డ గోసను స్వయంగా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మూసీ వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల కోసం ఏర్పాటు చేసిన నందనవనం కాలనీలో ఓటర్లు నేడు నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించే కీలక శక్తిగా ఎదిగారని గుర్తుచేశారు.

రూ.35.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో రూ.17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించారు. అదేవిధంగా నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ.17.66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునికీకరణ, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

గుర్రంగూడ ఎకో పార్క్ భూములను ప్రైవేటు లేఅవుట్లుగా మార్చే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుందని, సుప్రీంకోర్టులో పోరాడి 424 ఎకరాలను నేషనల్ పార్క్‌గా ప్రజలకు అంకితం చేశామని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో రూ.2,400 కోట్ల వ్యయంతో 240 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.