19 June, 2026 | 2:31 AM

లిక్కర్ కంపెనీలు లబో దిబో!

19-06-2026 01:27 AM

మద్యం ఆదాయం వచ్చింది వచ్చినట్టుగా మాయం!

  1. నాలుగు నెలలుగా మద్యం కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు 3,725 కోట్లు 
  2. బకాయి డబ్బును మళ్లిస్తున్న సర్కార్

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మద్యం అమ్మకాలన్నీ క్యాష్ అండ్  క్యారీ పద్ధతిలోనే సాగుతుంటాయి. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం దుకాణాదారులు డబ్బులు ముందుగానే చెల్లించి మద్యంను తీసుకెళతారు. అయితే నాలుగు నెలలుగా మద్యం సర ఫరా చేసే ప్రైవేటు మద్యం కంపెనీలకు రాష్ట్ర ప్ర భుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు?. గడిచిన నాలుగు నెలలకుపైగా కాలంలో మద్యం కం పెనీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మద్యం బకాయిలులు అక్షరాలా.. 3,725.73 కోట్లు. మరి క్యాష్ అండ్ క్యారీ విధానమే  కొనసాగుతున్నప్పు డు ఇంతగా బకాయిలు ఎందుకు పేరుకుపోతున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని దృష్టిలోపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డర్ ప్రకారం ఉత్పత్తి కంపెనీలు ఆయా బ్రాండ్లలో మద్యాన్ని సరఫరా చేస్తాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తుంది. అయితే 2025 డిసెంబర్ మొదటి వారం వరకు బకాయిలన్నీ చెల్లించిన ప్రభుత్వం మాత్రం.. ఆ తరువాత ఇప్పటివరకు ఒక్కపైసాకూడా చెల్లించలేదు. ఇదికాస్తా.. ఏప్రిల్ మొదటివారం, 2026 నాటికి బకాయిల మొత్తం రూ. 3,725.73 కోట్లకు చేరింది.

దీనితో రాష్ట్రానికి మద్యం సరఫరా చేసే కంపెనీల యాజమాన్యాలు లబోదిబో మంటున్నాయి. తాము సరఫరా చేసే మద్యం నిల్వలతో వ్యాపారం చేస్తూ.. తమకు నాల్గు నెలలపాటు బకాయిలు పెండింగులో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే తమ బకాయిలు చెల్లించాలంటూ..

తాజాగా మద్యం ఉత్పత్తిదారుల సంఘాలు బ్రీవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కాహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే తమ బకాయిలు చెల్లించాలంటూ విజ్ఞప్తి చేశారు. నిజానికి ఏప్రిల్ మొదటి వారం నాటికే బకాయిలు ఇంతలా పేరుకుపోతే.. మరి ఏప్రిల్, మే, జూన్ నెల మూడోవారం నాటికి ఇదికాస్తా.. రూ. 5 వేల కోట్లకు పైగా చేరే అవకాశం ఉందని వారంటున్నారు.

అంతా క్యాష్ అండ్ క్యారీ..

ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం ఉత్పత్తి చేసిన కంపెనీలు మద్యాన్ని ప్రభుత్వం (ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ) ఆధ్వర్యంలోని బేవరేజెస్ కార్పొరేషన్‌కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ దుకాణాలు (వైన్స్‌లు), బార్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు (వివిధ రకాల పన్నులు కలిపి) అమ్ముతుంటాయి. ఇక్కడ వైన్స్ అయినా.. బేవరేజెస్ కార్పొరేషన్ అయినా.. క్యాష్ అండ్‌క్యారీ విధానమే అమలవు తోంది.

అంటే.. మద్యం రిటైలర్లు (వైన్ షాపులు), బార్లు, బార్ అండ్‌రెస్టారెంట్ల యాజమానులు తమకు కావాల్సినంత మద్యాన్ని ముందుగానే డబ్బులు చెల్లించి (డీడీలు, చెక్కుల రూపంలో) తీసుకెళతారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన మార్జిన్‌తో.. రిటైల్ దుకాణాల యజమానులు వినియోగదారులకు అమ్ముకుంటారు. ఇక్కడకూడా క్యాష్ అండ్ క్యారీ విధానమే అమవుతుంది. అంటే దిగువస్థాయిలో మద్యం వినియోగదారుని నుంచి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే వ్యాపారుల వరకు మొత్తం క్యాష్ అండ్‌క్యారీ విధానమే అమలవుతోంది.

ప్రభుత్వ అవసరాలకు మళ్ళింపు.. 

మద్యం వ్యాపారంపై వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ అవసరాలకు, వివిధ పథకాలకు మళ్ళించుకుంటే ఫరవాలేదు.. కానీ.. తమకు చెల్లించాల్సిన మొత్తాన్నికూడా వివిధ అవసరాలకు వాడుకుని.. నా లుగైదు నెలలైనా తమకు చెల్లించకపోవడాన్ని మ ద్యం ఉత్పత్తి కంపెనీలు గర్హిస్తున్నారు. మద్యం వ్యా పారంతో వచ్చిన లాభంతో ఏమైనా చేసుకోండి.. కానీ తమకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రం వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బకాయిలతోపాటు.. వాటిపై వడ్డీనికూడా తాము కోల్పోతున్నామని, తమపై వడ్డీ అదనపు భారంగా పరిణమిస్తోందని మద్యం ఉత్పత్తిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిల ను తక్షణం చెల్లించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా మాయం.. 

కింది నుంచి పై స్థాయి వరకు క్యాష్ అండ్ క్యారీ విధానంలోనే మద్యం వ్యాపారం సాగుతుంటే.. మద్యం ఉత్పత్తి దారులకు నాలుగు నుంచి ఆరు నెలలపాటు బకాయిలు ఎందుకు పేరుకుపోతున్నాయనేది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. నాలుగు నెలల్లోనే రూ. 3,725 కోట్లకుపైగా విలువైన మద్యాన్ని ఉత్పత్తి దారులైన కంపెనీల నుంచి తెచ్చుకుని.. కిందిస్థాయిలో వినియోగదారులకు అమ్మారు. మరి మద్యం అమ్మితే వచ్చిన ఆదాయం ఏదీ.. అసలు ఏదీ అనే ప్రశ్న ఉదయిస్తోంది.

రూ. 3,725 కోట్లకుపైగా విలువైన మద్యాన్ని తీసుకొచ్చి వ్యాపారం చేసిన ప్రభుత్వం ఎంత లాభార్జన చేసిందనే విషయాన్ని పక్కనపెడితే.. కనీసం రూ. 3,725 కోట్ల మొత్తాన్ని అయినా.. ఉత్పత్తి దారులకు చెల్లించాలి కదా. కానీ ఇటు వచ్చిన లాభంతోపాటు.. కంపెనీలకు చెల్లించాల్సిన రూ. 3,725 కోట్లు ఎక్కడికి వెళ్ళాయనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

క్రెడిట్‌పై మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచి మద్యాన్ని తెచ్చుకుంటున్న ప్రభు త్వం.. దానితో వ్యాపారం చేసి.. ఆదాయా న్ని ఆర్జిస్తున్నా.. బకాయిలు పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే విషయంలో తమ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ.. మద్యం ఉత్పత్తి కంపెనీల సంఘాలు డిమాండ్‌చేసి లేఖలు రాయడం గమనార్హం.