19 June, 2026 | 2:44 AM

౩౦న రైతు భరోసా

19-06-2026 01:34 AM

ఖమ్మం జిల్లా మధిర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా విడుదల

  1. తొలి విడతలో రూ.4,500 కోట్లు 
  2. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
  3. ఏడు రకాల సన్నవడ్లకు బోనస్ కొనసాగింపు 
  4. పంటల కొనుగోళ్లపై కేంద్రంపై ఒత్తిడి తెస్తాం 
  5. మెట్రో విస్తరణకు అనుమతులు కోరుతాం 
  6. ‘ఈ విధానంలో సమావేశాలు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి 
  7. సమీక్షలో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దనసరి సీతక్క

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : వానాకాలం సాగు పనులు ఊపందుకున్న వేళ, రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైతుభరోసా నిధులను ఈనెల 30న విడుదల చేయాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మధిర బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నిధుల పంపిణీ ప్రారంభం కానుంది. సచివాలయంలో గురువారం మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

దీంతో పాటు వ్యవసాయం, రైతు సంక్షేమం, ఎరువుల లభ్యత, పంటల కొనుగోలు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, పరిపాలనా సంస్కరణలు, వీబీజీ రాంజీ పథకం తదితర అంశాలపై మంత్రుల చర్చలు జరిపారు. సమావేశం అనంతరం సహచర మంత్రులు తుమ్మ ల నాగేశ్వర్‌రావు, సీతక్కతో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుభరోసా పథకం కింద రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.

తొలి విడతలో రూ.4,500 కోట్లు విడుదల చేయ నున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న బోనస్‌ను ఏడు సన్నరకాల వరి వంగడాలకు కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఉత్తమ్ తెలిపా రు. మార్కెట్ డిమాండ్, వినియోగదారుల అభిరుచులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715 వరి వంగడాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుం దని మంత్రి  వివరించారు.

ఈ వంగడాలు రాష్ట్రంలో సాగవుతున్న సన్నబియ్యం పంటలో దాదాపు 83 శాతం వాటాను కలిగి ఉండటమే కాకుండా ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ వెలుపల కూడా మంచి మార్కెట్ కలిగి ఉన్నాయన్నారు. తెలంగాణకు ఎరువుల కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు సుమారు 2 లక్షల మెట్రి క్ టన్నుల యూరియా కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, ఆ మేరకు సరఫరా జరగలేదని తెలిపారు. 

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయా లని కేంద్రాన్ని కోరాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్సీ) ద్వారా ప్రతిపాదించిన రుణానికి వెంటనే ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు.

తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా హైదరాబాద్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి, ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి మెట్రో విస్తరణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. 

 రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

యాసంగి సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం దేశంలోనే ఈ సీజన్‌లో ఏ రాష్ట్రం సాధించని ఘనత అని మంత్రి పేర్కొన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో 48 గంటల వ్యవధిలోనే నేరుగా డబ్బులు జమ చేశామని చెప్పారు. తాజా సీజన్‌లోనే సుమారు రూ.18,000 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.

ప్రస్తుత వ్యవసాయ చక్రంలో మొత్తం రూ.38,000-39, 000 వరకు రైతులకు చెల్లింపులు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో కొనుగోలు కార్యకలాపాల ద్వారా రైతులకు దాదాపు రూ.1లక్ష కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని, బీఆర్‌ఎస్  పదేళ్ల పాలనలో సుమారు రూ.1.30 లక్షల కోట్లు చెల్లించిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కూడా సేకరించిందని ఉత్తమ్ తెలిపారు.

కేంద్ర సంస్థలు ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు చేయడం లేదన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా ధాన్యం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి, నాఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన విధానపరమైన బాధ్యతలను నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు త్వరలోనే న్యూఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలవనున్నట్లు తెలిపారు.

ఫైళ్లన్నీ పూర్తిగా డిజిటల్ రూపంలో..

పరిపాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను ఇకనుంచి ‘ఈ విధానంలో నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాగితపురహిత పాలనను ప్రోత్సహించడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యమన్నారు. ఈ విధానం ద్వారా క్యాబినెట్ నోట్లు, అజెండాలు, ఇతర అధికారిక పత్రా లు ఎక్కువగా డిజిటల్ రూపంలోనే ఉంటాయన్నారు. నూతన విధానం ద్వారా కాగితం వినియోగం తగ్గడంతోపాటు నిర్ణయ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక ట్యాబ్‌లను అందించారని పేర్కొన్నారు. 

రామగుండం ఎరువులను రాష్ట్రానికే ఎక్కువగా కేటాయించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్సీఎల్)లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అధిక భాగాన్ని తెలంగాణ రైతులకు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న ఎరువులను రాష్ట్ర రైతులకు అందిం చడం ద్వారా రవాణా వ్యయాలు తగ్గడంతో పాటు వ్యవసాయ సీజన్‌లో  ఎరువుల కొరతను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో రైతులు తొలకరిట వర్షాలు పడగానే విత్తనాలు వేయడానికి తొందరపడవద్దని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి, నేలలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు వేయాలని కోరింది.  

‘ఉపాధిహామీ’పై అధ్యయనం : సీతక్క 

ఉపాధిహామీ పథకంలో కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘా న్ని ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఉపసంఘంలో తనతో పాటు మంత్రులు  ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ వెంకటస్వామి ఉంటారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేసి, తెలంగాణపై పడే ఆర్థిక భారం ఎంత ఉంటుందో అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సిఫారసులు చేయనుందని వెల్లడించారు.  

‘నీట్’ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం

నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.95 లక్షల మంది విద్యార్థులు 2,008 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు అంచనా. హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.