19 June, 2026 | 3:22 AM

త్రివేణివనం ఎకో ప్రారంభం

19-06-2026 02:24 AM
  1. వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  2. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న ఎంపీ సురేష్ శెట్కార్

జహీరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న త్రివేణివనం- ఫారెస్ట్ ఎకో పార్కును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైద్రాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పచ్చని వాతావరణం నెలకొల్పాలనే లక్ష్యంతో వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 11 ఎకో పార్కులను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించడం సంతోషకరమన్నారు. జహీరాబాద్ ప్రాంతం నిమ్జ్ ద్వారా పారిశ్రామిక స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటోందని, భారీ పరిశ్రమలు రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

208 ఎకరాల విస్తీర్ణంలో త్రివేణివనం అటవీ ఎకో పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కేబీఆర్ పార్కులో ఉన్న సౌకర్యాలన్నీ ఇందులోనూ కల్పించామన్నారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిని పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. పార్కులో సైక్లింగ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అధిక సంఖ్యలో సందర్శించి పార్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ త్రివేణివనం జహీరా బాద్ ప్రజలకు గొప్పవరమన్నారు. ప్రతీ ఒక్కరూ ఒక్క మొక్క నాటాలన్నారు. అటవీ శాఖ రూపొందించిన వనమహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించి, జెండా ఊపి సైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్మన్ యూనిస్, ఉజ్వల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా అటవీ అధికారి ప్రసాద్ రెడ్డి, జహీరాబాద్ అధికారి సత్యం సుందర్ రావు, నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.