యాక్స్ మిషన్ మరోసారి వాయిదా
- రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీకేజీ కారణమన్న స్పేస్‌ఎక్స్
- త్వరలో కొత్త తేదీ ప్రకటించే అవకాశం
- వాయిదా నిర్ణయం సరైనదేనన్న ఇస్రో చైర్మన్
న్యూఢిల్లీ, జూన్ 11: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్స్ మిషన్ ప్రయోగం బుధవారం జరగాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యతో రోదసి యాత్రను వాయిదా వేస్తున్నట్టు స్పేస్ ఎక్స్ తెలిపింది. రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీకేజీ కారణంగా ప్రయోగం వాయిదా పడిందని వెల్లడించింది.
వ్యోమగాముల సురక్షితమే తమకు ప్రాధాన్యత అని, ప్రయోగానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని స్పేస్ ఎక్స్ ప్రతినిధులు తెలిపారు. కాగా శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా పడడంపై ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ స్పందించారు. మానవ సహిత యాత్ర కావడంతో ప్రయోగాన్ని వాయిదా వేయడం సరైన నిర్ణయమే నని నారాయణన్ పేర్కొన్నారు.
స్పేస్ ఎక్స్, యాక్సియం నిపుణులతో ఇస్రో బృందం చర్చలు జరిపిందన్నారు. దీని ప్రకారం ప్రయోగానికి ముందు లీక్‌ను సరిచేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. క్రయోజనిక్ ఇంజిన్ల విషయంలో ఇస్రో చైర్మన్ నారాయణన్‌కు మంచి పట్టు ఉంది. భారత్ సొంత క్రయోజనిక్ ఇంజిన్ల అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు.
ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లోనే ఉన్నారు. ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన పరిణామాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక యాక్స్ మిషన్ ప్రయోగం షెడ్యూల్ ప్రకారం మంగళవారమే జరగాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగాన్ని బుధవారానికి వాయిదా వేశారు. తాజాగా సాంకేతిక సమస్య వల్ల మళ్లీ వాయిదా పడింది.






