06-12-2025 09:21:45 PM
ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్
కరీంనగర్,(విజయక్రాంతి): దేశంలో బిజెపి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బాబ్రీ మస్జిదే అని, ఆనాడు మొఘల్ రాజు బాబర్ పేరిట మస్జిద్ నిర్మాణం జరుగకుంటే, నేడు దేశంలో బిజెపి ఉనికి లేకుండా ఉండేదని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్థంతిని పురస్కరించుకొని నగరంలోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అంశాన్ని మరిచి కేవలం బాబ్రీ మసీద్ అంశాన్ని లేవనెత్తి బిజెపి దేశంలో అధికారంలోకి వచ్చిందన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ మరణం, బాబ్రీ మజీదు కూల్చివేత ఈరెండు అంశాలు డిసెంబర్ 6నే జరగడం దురదృష్టకరమన్నారు. దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం, దేశ పౌరుల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని సైతం తుంగలో తొక్కుతోందని విమర్శించారు. దేశంలో దళితులు ముస్లింలు ఒక్కటైతే, రాజ్యాధికారం సాధించుకోగలమని, తద్వారా సంఘ్ పరివార్, బిజెపికి గుణపాఠం నేర్పిన వాళ్ళమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకుడు అన్నేమల్ల సురేష్, పాఠకుల భూమయ్య, సముద్రల అజయ్, రొండి అరుణ్, గజ్జెల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.