14 July, 2026 | 11:02 PM

బచ్చలమల్లికి పుష్పకు పోలిక అదే!

09-12-2024 12:45 AM

హీరో అల్లరి నరేశ్, అమృత అయ్యర్ ప్రధా న పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బచ్చలమల్లి’. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్న ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. “-నిర్మాత రాజేశ్ నాకు ముందు నుంచి ఫ్రెండ్. నేను చెప్పిన ‘బచ్చలమల్లి’ కథ నచ్చడంతో నరేశ్‌కి చెప్పమన్నారు. ఆయన కూడా సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. -మూర్ఖత్వం హద్దులు దాటేసిన క్యారెక్టర్. అందరిలో మూర్ఖుడుంటాడు కానీ అతనిలో ఈ మోతాదు ఎక్కువ.

అది ఎంత ఎక్కువ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి టీజర్‌లో పిల్లల చందాల బాక్సు కూడా ఎత్తుకెళ్లే సీన్ చూపించాం. అలా ఎత్తుకెళ్లి ఏం చేశాడనేది సినిమాలో చూసినప్పుడు తెలుస్తుంది. బచ్చలమల్లి క్యారెక్టర్ గెటప్, లుక్‌కు ‘పుష్ప’తో పోలిక రావడానికి కారణం ఉంది. పుష్ప పార్ట్ 1 హీరోది కూలీ క్యారెక్టర్. బచ్చలమల్లి ట్రాక్టర్ డ్రైవర్. వీళ్లంతా దాదాపుగా ఒకే ఛాయలో ఉంటారు. అలా గెటప్ విషయంలో కంపారిజన్ వచ్చింది తప్పా మరొకటి కాదు. -బచ్చలమల్లి.. వాస్తవ క్యారెక్టరే. చిన్నప్పుడు ఆ క్యారెక్టర్ గురించి వినేవాళ్లం. ఊరు గురించి నిలబడిన హీరోయిక్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వైబ్‌తో కేవలం టైటిల్ మాత్రమే పెట్టాం తప్పా ఇది ఆయన కథ కాదు. నేను 90ల్లో ఊర్లో పెరిగాను. అప్పటి మనుషులు ఎలా ప్రవర్తించేవారు నాకు తెలుసు. అందుకే కథను ఆ జోన్‌లో చెప్పాలనుకున్నా. ఇది క్యారెక్టర్ బేస్డ్ కథ. ఇందులో ఫాదర్ ఎమోషన్ కూడా మెయిన్. మూర్ఖత్వంతో వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పులు చేయొద్దనే థీమ్‌తో ఈ కథ చెప్పాను” అన్నారు డైరెక్టర్ సుబ్బు.