నేటి నుంచి బడిబాట
షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యాశాఖ
ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల పెంపే లక్ష్యం
12న సీఎం రేవంత్ హాజరయ్యే అవకాశం
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ మేరకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లయ్య భట్టు బుధవారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్ మారడం ఇది మూడో సారి. ముందస్తుగా జూన్ 1 నుంచి అని ప్రకటించి ఆ తర్వాత జూన్ 3 అన్నారు.
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు జూన్ 6 నుంచి జూన్ 19 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంపు కోసం ఉద్దేశించిన బడిబాటను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు మార్గదర్శకాలను జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.బడుల ప్రారంభానికి ముందు జూన్ 6 నుంచి 11 వరకు, ప్రారంభం తర్వాత జూన్ 12 నుంచి 19 వరకు వేర్వేరు కార్యక్రమాలను వెల్లడించారు. బడులు ప్రారంభమయ్యే జూన్ 12న బడిబాట కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అందరి భాగస్వామ్యంతో...
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కార్మిక శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సమాఖ్యలతో కలిసి సమావేశాన్ని నిర్వహించుకొని కార్యాచరణను కలెక్టర్లు రూపొందించుకోవాలని మల్లయ్య కోరారు. జిల్లా స్థాయిలో సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సాయంతో బడిబాటను నిర్వహించాలన్నారు. జూన్ 10 లోపు ఒక జత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్‌బుక్‌లను విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో ప్రభుత్వ బడుల్లో చేపడుతున్న మరమ్మతు పనులను వేగంగా చేయాలన్నారు.
బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండేలా...
బడి ఈడు పిల్లలు బడి బయట ఉండొద్దని, వారు స్కూళ్లల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తోంది. అంగన్‌వాడీల్లోని 5 ఏళ్లు నిండిన పిల్లలను సమీప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించాలన్నారు. చదువు ఆపేసిన పిల్లలు, బాలకార్మికులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు పంపించేలా చూడాలన్నారు.
బడుల పునఃప్రారంభ సమయంలో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు స్వాగతం పలకాలన్నారు. బడిబాటను ప్రజాప్రతినిధులు, ఉద్యోగులందూ సంప్రదాయక పద్ధతుల్లో నిర్వహించాలి. ప్రభుత్వ బడుల్లో చదివే అన్ని వర్గాల వారికి హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయని, అర్హత ఉన్న ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తల్లిదండ్రులకు వివరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.






