సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి
కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయను
పార్టీ ఏ బాధ్యతలిచ్చినా స్వీకరిస్తా
మీడియాతో ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్‌లో తానే అభ్యర్థిలాగా రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారని, కొందరు కర్ణాటక నుంచి వచ్చి డబ్బులు పంచారని, అయినా ఫలితం వారిని వెక్కిరించిందని ఎంపీ డీకే అరుణ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందు తన సొంత జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్సీ ఓడిపోయినందుకు ఆయనే పదవినుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ ఎంపీగా డీకే అరుణ ఎన్నికైన తర్వాత హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కేంద్రమంత్రి పదవి కోసం తాను లాబీయింగ్ చేయబోనని, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అరుణ తెలిపారు. తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఓటమికి సాకులు చెప్పేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటైందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం పదవికి రేవంత్ రాజీ నామా చేయాలని సొంత పార్టీ నుంచే డిమాండ్ వస్తోందని ఆరోపించారు. నల్లగొండ, భువనగిరిని గెలిపించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి సోదరుల నుంచి రేవంత్‌కు ఇబ్బందులు తప్పవని చెప్పారు. ప్రధానిగా మోదీ ఉండకూడదని చెప్పేందుకు రేవంత్ ఎవరని ప్రశ్నించారు.
14 స్థానాలు గెలుస్తామని, ఈ ఎన్నికలు తమకు రెఫరెండం అన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ 8 స్థానాలే గెలవటంపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు గుర్తించటం లేదన్నారు. ఆయన తన భాష మార్చుకోకుంటే ఇబ్బంది పడతారని అరుణ హెచ్చరించారు. తెలం గాణలో బీజేపీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని ధీమా వ్యక్తం చేశారు.






