ధాన్యం రైతు దైన్యం!
ఇంకెప్పుడు పూర్తి చేస్తారు
నెల రోజులుగా కళ్లాల్లోనే.!
మహబూబాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ధాన్యం పండించిన రైతు పరిస్థితి ధైర్యంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలో అనేక చోట్ల కొనుగోలు కేంద్రాల్లో వేల బస్తాల ధాన్యం ఎగుమతి కోసం నిరీక్షిస్తోంది. కొన్నిచోట్ల ధాన్యం ఇప్పటివరకు కాంటాలు కూడా నిర్వహించని పరిస్థితి నెలకొంది. మరి కొన్ని చోట్ల కాంటాలు నిర్వహించినప్పటికీ, మిల్లులు, గోదాములకు ఎగుమతికి సిద్ధంగా ఉంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ధాన్యం కొనుగోలు పూర్తి చేయడం విశేషం.
చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయింది. ధాన్యం కాంటాలు పూర్తి చేసిన వెంటనే రైతులకు రక్షిత్ ఇవ్వాలని అధికారులు ఆదేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కాంటాలు పెట్టిన ధాన్యానికి టార్పాలిన్ కప్పి కోతులు వాటిని తొలగించకుండా కర్రలు, రాళ్లు రక్షణగా పెట్టిన దృశ్యాలు అనేకం కనిపిస్తున్నాయి. ప్రధానంగా ధాన్యం తరలింపు కోసం అవసరమైన లారీలు, డీసీఎం వాహనాలు లభించడం లేదని చెబుతున్నారు. కొన్నిచోట్ల సొంత ట్రాక్టర్లు ఉన్న రైతులు తమ ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించినట్లు చెబుతున్నారు.
కొంత ట్రాక్టర్లు లేని రైతులు మాత్రం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్నారు. నెల రోజుల క్రితం ధాన్యం కొనుగోళ్లు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు కొనుగోలు పూర్తి చేయకపోవడం వల్ల తాము ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనేక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కొంత దాన్యం కాంటాలు పెట్టాల్సిన అవసరం ఉందని, కాంటాలు పెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఓవైపు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందని, ఒకటి రెండు రోజుల్లో ధాన్యం ఎగుమతి చేయకపోతే వర్షాలకు తడిసి దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు. రైతులు కొందరు వానకాలం దుక్కులు దున్నే పనిలో ఉన్నారని, తాము మాత్రం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు.
నెలరోజులుగా ఇక్కడే ఉంటున్నా..
ధాన్యం పంట కోత పెట్టి, అధికారులు చెప్పిన వి ధంగా శుభ్రం చేసి, బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తెచ్చాను. నెలరోజులైనా కాంటాలు పెట్టకుండా జాప్యం చేస్తున్నారు. కొందరికి ఇప్పటికీ కాంటపెట్టినప్పటికీ మిల్లుకు తరలించడం లేదు. మా తోటి రైతులు కొందరు ధాన్యం అమ్ముకొని, వానకాలం వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మేము మాత్రం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నాం. అధికారులు స్పందిం చి వెంటనే లారీలు పంపి ధాన్యాన్ని మిల్లుకు పంపి మమ్మల్ని, ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఇంటికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలి.
యాకన్న, రైతు, కలవల






