4 June, 2026 | 3:20 AM

ఎన్నాళ్లు.. ఈ కన్నీళ్లు..

04-06-2026 02:19 AM
  1. కంపెనీలకు ప్రజల ఘోష పట్టదా..?
  2. కంపెనీలకు కోట్ల లాభాలు.. ప్రజలకు కన్నీళ్ళు
  3. చుక్క నీళ్లు అందించని సర్వరాయ
  4. నల్లబంగారం తీస్తూ నగరాన్ని నాశనం చేస్తున్న సింగరేణి
  5. సర్వరాయ,  సింగరేణి నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం

సత్తుపల్లి, జూన్ 3 (విజయ క్రాంతి ): ఒకప్పుడు పచ్చదనంతో, మంచినీటి వనరులతో ప్రసిద్ధి చెందిన సత్తుపల్లి& ఇప్పుడు మండే ఎండలతో, తాగునీటి కష్టాలతో, కాలుష్యపు సెగలతో అల్లాడుతోంది. పట్టణ ప్రజల జీవన విధానాన్ని మార్చేస్తున్న ఈ పరిస్థితులకు కారణం ఎవరు..? అనే ప్రశ్నకు స్థానికులు స్పష్టంగా రెండు పేర్లనే చెబుతున్నారు  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మరియు సర్వరాయ షుగర్స్ లిమిటెడ్. కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్న ఈ రెండు పెద్ద కంపెనీలు& అదే నేలపై జీవిస్తున్న ప్రజల బాధలను మాత్రం పూర్తిగా మరిచిపోయాయని ప్రజాసంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఒకవైపు భూగర్భ జలాలను భారీగా వినియోగిస్తూ, మరోవైపు నల్లబంగారం తవ్వకాలతో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తూ సత్తుపల్లిని క్రమంగా సెగల నగరంగా మార్చేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా& పట్టణంలో ఇప్పటివరకు ఒక్క చలివేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడం ప్రజలను కలచివేస్తోంది. నీటి కోసం మహిళలు బిందెలతో తిరుగుతున్న దృశ్యాలు ప్రతిరోజూ కనిపిస్తున్నా& రోజుకు లక్షల లీటర్ల నీటిని వినియోగించే సంస్థలు మాత్రం కనీసం ఒక నీటి ట్యాంకర్ కూడా పంపకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ప్రత్యేకంగా సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఒకప్పుడు ఫ్యాక్టరీ బయట నల్లాలు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చిన సంస్థ& ఇప్పుడు కిన్లే పేరుతో మంచినీటిని బాటిళ్లలో నింపి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. కానీ అదే ప్రాంత ప్రజలకు ఒక్క చుక్క తాగునీరు కూడా అందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మన నేలలోని నీటిని తీసుకుని వ్యాపారం చేస్తున్నారు& కానీ మన పిల్లల దాహం తీర్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు అంటూ స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజూ భారీగా నీటిని ఫిల్టర్ చేసి బయటకు తరలిస్తున్న సంస్థ& కనీసం పట్టణ రోడ్లపై నీరు చల్లి వేడి తగ్గించే ప్రయత్నం కూడా చేయకపోవడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నల్లబంగారం తవ్వకాలు, భారీ వాహనాల రాకపోకలతో దుమ్ము, కాలుష్యం పెరిగిపోతుండగా& ప్రభావిత ప్రాంతాల్లో చెట్ల పెంపకం, నీటి సదుపాయాలు, వేసవి ఉపశమన చర్యలు చేపట్టడంలో సంస్థ పూర్తిగా విఫలమైందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజల భూములు& ప్రజల నీళ్లు& ప్రజల వనరులు వాడుకుని కోట్ల సంపాదిస్తున్న కంపెనీలు& అదే ప్రజల కష్టాల్ని మాత్రం పట్టించుకోవడం లేదు అంటూ సామాజిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

ప్రజల సొమ్ముతో లాభాలు సంపాదించి& ప్రజల కోసమే ఒక్క రూపాయి ఖర్చు పెట్టని కంపెనీలను ఎందుకు సహించాలి? అని ప్రశ్నిస్తున్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, తాగునీటి అవసరాలపై కనీస బాధ్యత కూడా తీసుకోకుండా కేవలం వ్యాపార ప్రయోజనాలకే పరిమితమవుతున్న ఈ రెండు సంస్థలపై ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ వెంటనే జోక్యం చేసుకుని& సర్వరాయ,

సింగరేణి యాజమాన్యాలతో చర్చించి పట్టణంలో చలివేంద్రాలు, ఉచిత తాగునీటి కేంద్రాలు, చెట్ల పెంపకం, రోడ్లపై నీరు చల్లడం వంటి వేసవి ఉపశమన చర్యలు చేపట్టేలా  ఒత్తిడి తేవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లాభాల కోసం మాత్రమే కాదు& ప్రజల కోసం కూడా పనిచేయండి అనే సత్తుపల్లి ప్రజల వేడుకోలు ఇప్పుడు ఆగ్రహంగా మారుతోంది. సమస్యలు మరింత తీవ్రమయ్యేలోపు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే& రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.