calender_icon.png 4 December, 2024 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేకరీ క్వీన్

16-07-2024 12:05:00 AM

రజనీ బెక్టార్.. ఓ సాధారణ మహిళ. పెద్దగా చదువుకోలేదు. చిన్నవయసులో పెళ్లి. కుటుంబ బాధ్యతలు. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ.. తనకున్న అభిరుచినే వృత్తిగా ఎంచుకొని ఇవాళ ఉన్నత స్థాయికి ఎదిగారు. మహిళలు గడప దాటి బయటకురాని రోజుల్లోనే ఆమె ‘క్రిమికా’ అనే ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఓర్పు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించి చూపించారు. ఒక సాధారణ గృహిణి నుంచి పద్మశ్రీ అవార్డు అందుకునే వరకు సాగిన ఆమె విజయ ప్రస్థానం గురించి ప్రత్యేక కథనం..

రజనీ బెక్టార్ కరాచీ నగరంలో  ఒక ఉన్నత కుటుంబంలో1940లో పుట్టింది. తండ్రి అకౌంటెంట్ జనరల్. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం లాహోర్‌లో పెరిగారు. ఆమె ఏడేళ్ల వయసులో దేశ విభజన జరిగింది. రజని కుటుంబం భారతదేశానికి వచ్చింది. భారత్‌కు వచ్చాక ఢిల్లీలోని మిరిండా హౌస్‌లో చదువుకున్నారు. కాలేజ్ చదువు పూర్తయ్యేలోపే లూథియానాలోని ఒక వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టింది. అప్పటికి ఆమె వయసు పదిహేడు ఏళ్లు మాత్రమే. చదువు పూర్తికాకముందే పెళ్లికి తలవంచాల్సి రావడంతో కలిగిన ఆ సంతృప్తే ఆమెను ఇప్పుడు విజేతగా నిలిపింది. రజనీకి పదిహేడేళ్లు రాగానే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. లూథియానాలోని వ్యాపార కుటుంబానికి చెందిన ధరమ్‌వీర్‌తో. అప్పుడు ఆమె ఢిల్లీలోని మిరిండా హౌస్‌లో కాలేజ్ చదువుతున్నది. ఆమెకు జీవితంలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆసక్తి, పట్టుదల ఉండేది. ఆమె ఆలోచనలను గౌరవించి పెళ్లి చేసుకున్నారు భర్త. 

పెళ్లి తర్వాత జీవితం..

రజని భర్త ఉద్యోగానికి వెళ్లాగానే.. ఆమె ఇంటి పనులు చేసుకునేది. కొన్నాళ్లకు ఆమె ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చింది. వాళ్లు పెద్దవాళ్లయ్యాక ఆమెకు కొంచెం తీరిక సమయం దొరికింది. ఇంకేం తనకు ఇష్టమైన బేకింగ్ (కేకులు, బన్నులు, ఐస్‌క్రీమ్స్) తయారీ మొదలు పెట్టాలనుకుంది. ఐస్‌క్రీమ్, కేకుల తయారీ నేర్చుకోవాలని పంజాబ్ అగ్రీకల్చర్ యూనివర్సిటీలో చేరింది. ఇంటికి వచ్చాక బేకరీ ఐటమ్స్‌తో ప్రయోగాలు చేస్తూ ఉండేది. ఆమె వంటల రుచి చూసినా బంధువులు, స్నేహితులు సొంతంగా వ్యాపారం పెట్టొచ్చు కదా.. అని సలహాలిచ్చేవారు. వాళ్లందరి ప్రోత్సాహంతో 1978లో ఇంట్లోనే చిన్న బేకరీని ప్రారంభించింది. తన శ్రమకు భర్త సహకారం అందించారు. 20 వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టింది. అది కాస్త ఐదేళ్ల కాలంలో ఉన్నతమైన లక్ష్యాలను చేరుకుంది. 

నమ్మిన సిద్ధాంతం..

తాను చేసే ఐస్‌క్రీమ్స్, బిస్కెట్స్, బ్రెడ్ వంటి బేకరీ ఫుడ్స్ రుచి బాగుండటంతో ప్రజల్లో ఆదరణ లభించింది. అంతా గాడిలో పడిందనుకునే  సమయంలో 1984లో ఇందిరా గాంధీ హత్య జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ మొదలైంది. పంజాబ్ అట్టుడికిపోయింది. సిక్కులకు వ్యతిరేకంగా దాడులు మొదలయ్యాయి. ఆస్తులు ధ్వంసం చేశారు. ఆ సమయంలోనే ఒక అల్లరి మూక రజని పెద్దకొడుకు అక్షయ్‌ని కిడ్నాప్ చేసింది. వాళ్ల నుంచి ఆ కుర్రాడు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు ఏడాది పాటు వ్యాపారం మూతపడింది. ఆర్థికంగా కుదేలైంది. పోయిన చోటే వెతుక్కోవాలన్నది రజని నమ్మిన సిద్ధాంతం. మళ్లీ వ్యాపారం మొదలు పెట్టింది. అదే ఏడాది అనుకోని అవకాశం రజని తలుపు తట్టింది. మెక్ డొనాల్డ్స్ కంపెనీ బన్నుల సరఫరా కోసం ఆమెతో ఒప్పందం చేసుకుంది. దాని కోసం ఒక ఏడాదిపాటు ఎక్సర్‌సైజ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో పండే నాణ్యమైన గోధుమల పిండితో చేసిన బన్నులకు వారి ఆమోదం లభించింది. 

వంటగది నుంచి..

రజని బేకరి ఉత్పత్తులకు ఆదరణ బాగా పెరిగింది. కొన్నాళ్లకు తన ఉత్పత్తులకు ఒక బ్రాండ్ నేమ్ ఉండాలని నిర్ణయించుకుంది. ‘క్రిమికా’ అనే బ్రాండ్‌ని రిజిస్టర్ చేసి, ఆ పేరుతో రకరకాల బిస్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. తను తయారు చేసే ఐస్‌క్రీమ్‌లు బాగున్నాయనే పేరు వచ్చింది. కస్టమర్ల సంఖ్య పెరిగింది. కొన్నేళ్లు గడిచిపోయాయి. తన బేకరీలో రోజుకు 50 వేలకు పైగా బన్నుల తయారు చేసే స్థాయికి వ్యాపారం ఎదిగింది. పనివాళ్లు, ఆదాయం పెరిగింది. వంటగదిలో మొదలైన చిన్న పరిశ్రమ కంపెనీ స్థాయికి ఎదిగింది.  

నా టేస్ట్ బడ్స్‌కి థ్యాంక్స్

“క్వ్రాలిటీ మంచిగా ఉండటంతో ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మెక్‌డీకి అసరమైన సాస్‌లు కూడా పెట్టాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా వేగంగా విస్తరించగలిగాం. టర్నోవర్ ఏడు వేల కోట్లకు చేరింది. మా ముగ్గురబ్బాయిలు బాధ్యతలు పంచుకుని వ్యాపారాన్ని కొనసాగించారు. ఇప్పుడు మూడవ తరం అడుగుపెట్టింది. ప్రస్తుతం క్రిమికాకు సంబంధించిన రోజువారీ బాధ్యతలేవీ లేవు. కానీ కీలకమైన సమయాల్లో రోజుకు పదహారు గంటలు పనిచేశాను. ఆహారం మీద నాకున్న ప్రత్యేకమైన అభిరుచే నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. ఇవాళ విజేతగా నిలబెట్టింది. నేను నా టేస్ట్ బడ్స్‌కి థ్యాంక్స్ చెప్పాలి. క్వాలిటీలో భాగంగా ప్రతిదీ రుచి చూడాలి. కేవలం రుచి మాత్రమే చూడాలి. కడుపు నిండా తినకూడదు. కడుపు నిండితే రుచిని గ్రహించే శక్తిని కోల్పోతాం. ఆ నియమం పాటిస్తే విజయాన్ని ఆస్వాదిస్తారు. ఈ దేశంలో జీవించాలని వచ్చాం. ఇక్కడే సవాళ్లనెదుర్కొన్నాం. మూడేళ్ల కిందట పద్మశ్రీ పురష్కారం అందుకున్నాను. ఈ దేశం నాకు చాలా మంచి అవకాశాల్ని కల్పించింది.”

రజనీ బెక్టార్