ఖమ్మం కోర్ట్ సీనియర్
న్యాయవాదికి అరుదైన గౌరవం
చెన్నైలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న స్వామి రమేష్ కుమార్
రఘనాథపాలెం,(విజయక్రాంతి): న్యాయవాద వృత్తిలోనూ, క్రీడా రంగంలోనూ విశేష సేవలందిస్తున్న ఖమ్మం ముద్దుబిడ్డ, సీనియర్ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ ని ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. చెన్నై నగరంలో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించిన ఎక్స్.ఐ.ఎఫ్.టి అకాడమీ 2026 వేడుకల్లో భాగంగా ఆయనకు ‘జీవన సాఫల్య పురస్కారాన్ని’ (లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు) అందజేశారు.
భారతీయ శరీర సౌష్టవ సమాఖ్య, ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా క్రీడా రంగానికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ అకాడమీ ప్రతినిధులు ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక నిబద్ధత గల న్యాయవాదిగా సమాజానికి సేవ చేస్తూనే, జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్న రమేష్ కుమార్ కి ఈ పురస్కారం దక్కడం మన జిల్లాకే కాకుండా, ఖమ్మం జిల్లా న్యాయవాదుల సంఘానికి (బార్ అసోసియేషన్) ఎంతో గర్వకారణమని పలువురు కొనియాడారు. ఈ గొప్ప పురస్కారం అందుకున్న సందర్భంగా స్వామి రమేష్ కుమార్ కి జిల్లా ప్రముఖులు, తోటి న్యాయవాదులు, క్రీడాభిమానులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.




