- 20 ఎకరాల చెరువు 10 ఎకరాలకు కుదింపు
- ఆదిలాబాద్ పట్టణంలో ఆక్రమణల జోరు
- నిర్మాణాలతో కనుమరుగవుతున్న చెరువులు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): గ్రేడ్ 1 మున్సిపాలిటీ స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్‌లో ఆక్రమణలు జోరందుకుంటున్నాయి. ఖాళీ స్థలం కనబడితే చాలు ఆక్రమణదారులు గద్దల్లా వాలిపోతున్నారు. మున్సిపాలిటీలో విలీనమైన పలు గ్రామా లు, కాలనీలలో ఉన్న చెరువులు సైతం రక్షణ లేకపోవడంతో ఆక్రమణకు గురవుతున్నాయి.
చెరువులు, కుంటలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఆక్రమణలు జరగుతున్నాయి. రియ ల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు తోడుగా రాజకీయ నాయకుల అండదండలతో కొందరు ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఉన్న చెరువుల్లో ఖానా పూర్ చెరువు ఇప్పటికే చాలా మేరకు ఆక్రమణకు గురి కాగా, పట్టణంలోని బాలాజీ నగర్‌కు ఆనుకొని ఉన్న చెరువు సైతం ఆక్రమణ గురవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసతానికి ఎన్నో చెరువులు ఆక్రమణదారుల చేతిలోకి వెళ్లి కనుమరుగవుతున్నాయి.
20 ఎకరాల చెరువు 10 ఎకరాలకు కుదింపు..
ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీనగర్ కాలనీ చెరువుకు ఆనుకొని వెలిసింది. గతం లో బాలాజీనగర్ చెరువు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా రోజురోజుకు ఆక్రమణలు పెరిగిపోయి ప్రస్తుతం 10 ఎకరాలకే చెరువు కుదించబడింది. చెరువు చుట్టూ ఇండ్ల నిర్మాణాలు జరగడంతో పాటు కొందరైతే చెరువు లోనే ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం విస్మయానికి గురిచేస్తోంది.
ఇంత బహిరంగంగా ఆక్ర మణలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. బఫర్ జోన్లను అతి క్రమించి నిర్మాణాలు చేపట్టడంతో చెరువు స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. రికార్డుల్లో ఉన్న చెరువు స్థలం క్షేత్రస్థాయిలో లేకపోవడంతో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగు తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
సర్వేతో బయటపడనున్న ఆక్రమణలు
ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీ నగర్ చెరువుపై గతంలో, ప్రస్తుత స్థితిగతులపై అధికార యంత్రాంగం సరేలు చేపడితే ఆక్రమణలు బట్టబయలవుతాయని స్థానికులు పేర్కొంటున్నారు. చెరువులపై సంబంధిత మున్సిపల్, నీటి పారుదల రెవెన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలానే చెరువులు, కుంటలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని స్థానికులు వాపోతున్నారు.