దేశంలోనే తొలిసారి మినిమల్లి ఇన్వేసివ్ పద్ధతిలో కాలేయ మార్పిడి
హైదరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు దేశంలోనే తొలిసారిగా మినిమల్లి ఇన్వేసివ్ (చిన్నపాటి కోతలతో చేసే ఆపరేషన్) విధానంలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న 63 ఏళ్ల వ్యక్తికి ఈ పద్ధతిలో కాలేయమార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స జరిగిన కేవలం ఐదు రోజుల్లోనే ఆపరేషన్ అయిన వ్యక్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ సచిన్ డాగా తెలుపుతూ..
‘లివర్ సిరోసిస్ అనేది చాలా తీవ్రమైన సమస్య. ఈ వ్యాధి వచ్చిన చాలామందిలో కాలేయమార్పిడి మాత్రమే సరైన చికిత్స. దీనికి సంప్రదాయ శస్త్రచికిత్సల్లో పెద్ద కోతలు పెట్టాలి. దానివల్ల ఆస్పత్రిలోనే ఎక్కువ రోజులు ఉండాల్సి ఉంటుంది. కోలుకోడానికి కూడా ఎక్కువ టైమ్ పడుతుంది. మినిమల్లి ఇన్వేసివ్ పద్ధతిలో కండరాల కోత ఉండదు’ అని చెప్పారు. ఆపరేషన్ చేసిన తర్వాత పేషంట్ త్వరగా కోలుకుంటాన్నారు.