హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘన్సీమియాగూడ పంచాయతీని శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. విలీనంపై ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. ఘన్సీమియాగూడ పంచాయతీని శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 2న జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ అదే పంచాయతీకి చెందిన టీ సిద్ధయ్య, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విలీనం ద్వారా ప్రతి పనికీ శంషాబాద్ వెళ్లాల్సి వస్తుందని, పన్నుల భారం భారీగా పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. వాదనలను విన్న ధర్మాసనం పంచాయతీలను మున్నిపాలిటీలో విలీనం చేయడం ద్వారా మెరుగైన వసతులు ఏర్పడతాయని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని వ్యాఖ్యానించింది. ప్రతివాదులైన సాధారణ పరిపాలన, పురపాలక, పంచాయతీ శాఖల ముఖ్యకార్యదర్శులు, రంగారెడ్డి కలెక్టర్, శంషాబాద్ మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.