23 July, 2026 | 1:46 AM

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

23-07-2026 12:00 AM

సికింద్రాబాద్, జూలై 22 (విజయక్రాంతి): బల్కంపేట శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధల నడుమ జరిగింది. వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ వాయిద్యాలు, మంగళవాద్యాలు, భక్తుల జైజైధ్వానాల మధ్య అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు.

ఈ ఆధ్యాత్మిక వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు, ఆలయ ఈవో వినోద్ లతో కలిసి పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. అనంతరం రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి అమ్మవారికి మొక్కులు సమర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఈ మహోత్సవాలకు తరలివస్తారని,రథోత్సవం భక్తుల విశ్వాసానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

అమ్మవారి కృపతో రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సుభిక్షం నెలకొనాలని, ప్రతి కుటుంబం ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధితో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.