ఖాకీ వనంలో కీచకులు?
- ఆపద వస్తే అండగా ఉందాల్సిన వారే అఘాయిత్యాలు
- మంచిగా ‘పంచే’స్తారంటూ అధికారుల వత్తాసులు
నల్లగొండ నిఘా విభాగం, జూలై 22 : ప్రజలకు ఆపద వస్తే కంటికి రెప్పలా కాపాడాల్సిన పోలీసు శాఖలో కొందరు ‘కామాంధులు’ చేరి, వ్యవస్థకే తీవ్ర మచ్చ తెస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీస్ శాఖలో వరుసగా వెలుగుచూస్తున్న కీచక పర్వాలు ప్రజల్లో నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు.. ‘విధి నిర్వహణలో, దొంగలను పట్టుకొని మంచిగా ‘పoచే‘స్తాడు‘ అనే సాకుతో వెనుకేసుకురావడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.
ఎ లాంటి ప్రయోజనం ఆశించి వెనుకేసుకొస్తున్నారో అధికారులఅందరికి తెలిసిన బహిరంగ రహస్యమే.తాజాగా నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికను వేధించిన కేసులో ప్రస్తుతం గుర్రంపోడ్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను 5 రోజుల క్రితంపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన జిల్లాలోసామాజిక మధ్యామాలో ట్రోల్ కావడం తీవ్ర కలకలం రేపింది.
ఇదిలావుంటే.. ఓ బాలిక తనను వేధిస్తున్నారంటూ కానిస్టేబుల్ పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం మాములు విషయం కాదు. ఎంతో ధైర్యం ఉంటే గానీ ఆ పనిచేయాలంటే సాధ్యపడదు. అయితే ఇలా బయటకు రాని వాళ్ల పరిస్థితి ఏంటి..? ఎంతగా మానసికంగా.. భౌతికంగా కుమిలిపోతున్నారో అంతుచిక్కడం లేదు.
కానిస్టేబుల్ పై గతంలో టూ టౌన్ లో ఫోక్సో కేసు నమోదయింది. గతంలోనూ సస్పెన్షన్కు గురయ్యాడు. ఓ బాలిక ఇంటి గోడకు పోస్టర్లు అంటించిన సంఘటనలో కేసు నమోదు అయింది. ఇతని విధి నిర్వహణకు చేస్తున్న కీచక పనులతో ఇదే బుద్ధి అంటూ పోలీస్ శాఖలో, ప్రజలు చర్చించుకుంటున్నారు
రాజీ పడాల్సిందే..
నల్లగొండ పట్టణ కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో పనిచేసిన ఓ కానిస్టేబుల్ బాగోతం కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. అతని వేధింపుల వల్ల ఐదారు కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభకు గురై, సర్వస్వం కోల్పోయిన విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించినట్లు ఆ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు.. గతంలో ఈ ఉదంతంపై పోలీస్ స్టేషన్ పరిధిలోనే రాజీ కుదిర్చినప్పటికీ.. సదరు కానిస్టేబుల్ బుద్ధి మార్చుకోలేదు.
దీంతో బాధితురాలి భర్త, బంధువులు అతనిపై దాడికి దిగారు. ఇంత జరిగినా అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా పట్టణ కేంద్రంలోని మరో స్టేషన్కు బదిలీ చేయడం గమనార్హం. ఇదే టూ టౌన్ పరిధిలో పనిచేసిన మరో ఇద్దరు అధికారులపై కూడా ఇలాంటి తీవ్రమైన కీచక ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ వాటిని గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ తరహాలోనే అణచివేశారు. శాఖాపరమైన విచారణ జరిపి సస్పెండ్ చేయాల్సింది పోయి.. పోలీస్ తరహాలోనే ‘రాజీ’ కుదిర్చి మరీ మంచి పోస్టింగ్స్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.
చట్టం వారికి చుట్టమా?
మండల, సర్కిల్ స్థాయి అధికారులపై ఇలాంటి వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేయాల్సింది పోయి.. ‘పోలీస్ రాజీలు’ తెరపైకి రావడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తప్పు చేసిన సామాన్యుడిపై థర్డ్ డిగ్రీలు ప్రయోగించే చట్టం.. ఖాకీ బట్టలు వేసుకున్న కీచకులకు మాత్రం చట్టం చుట్టమవుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి ఘటనల వల్ల ప్రజలకు భద్రత కరువవ్వడమే కాకుండా నిజాయితీగా పనిచేసే మిగతా పోలీసుల ప్రతిష్ట కూడా గంగలో కలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని, ఇలాంటి కీచక పోలీసులపై కఠినమైన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.






