బెజ్జంకిలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
10-07-2026 04:33 PM
సిద్దిపేట,(విజయక్రాంతి): విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ బెజ్జంకి మండలంలో విజయవంతమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంగెం మధు తెలిపారు. ఈ సందర్భంగా సంగెం మధు, ఎస్ఎఫ్ఐ నాయకుడు బొమ్మిడి సాయి కృష్ణ మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డి ఈ ఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






