సాలూరలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియపై సమీక్ష
బోధన్,(విజయక్రాంతి): సాలూర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్‌ఏ-2లతో సమావేశం నిర్వహించి, ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ (SIR) పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ మాట్లాడుతూ, సాలూరు మండలంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం ఎలా జరుగుతోందో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు కావాలని, ఎలాంటి తప్పులు, లోపాలు లేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
సాలూర మండలంలో ఇప్పటివరకు ఎస్‌ఐఆర్ ఫారాలు 48 శాతం మాత్రమే నమోదు అయినట్లు తెలిసిందని, ఇది సరిపోదని ఆయన అన్నారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు కలిసి ఓటర్ల జాబితాను త్వరగా నమోదు చేయాలని, సాలూరు గ్రామ సర్పంచ్‌తో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షులు కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతిరోజూ జరిగే కార్యక్రమాల్లో అందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఓటర్ లేనిదే ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బోధన్ నియోజకవర్గానికి పార్టీ పరంగా ఇంచార్జ్‌లుగా ఉన్న గంగ కిషన్, శేఖర్ గౌడ్, రాజిరెడ్డి, గంగ శంకరన్న, అలాగే స్థానిక సాలూరు సర్పంచ్ పాల్గొన్నారు. సమావేశంలో బీఎల్‌ఏ-2లకు ఓటరు సవరణ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు వివరించి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులందరికీ న్యాయం జరిగేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఓటర్లు కచ్చితంగా ఎస్‌ఐఆర్ ఫారం నింపి, తమ పరిధిలోని బీఎల్‌ఓ లేదా బీఎల్‌ఏలకు అందజేయాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నామని తాహిర్ బిన్ హందన్ తెలిపారు.






