విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలి
- వామపక్ష విద్యార్ధి సంఘాల పిలుపు
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10న చేపట్టబోయే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల (SFI, PDSU, AIFDS, AISB) నాయకులు కోరారు. గురు వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్ షిప్ లు, ఫీజు రియంబర్స్ మెంటు బకాయిలు, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ, విద్యార్థుల భద్రత వంటి అనేక సమస్యలు పేరుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం వాటి పరిష్కారంపై నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విమర్శించాయి. ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని, విద్యార్థుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అన్ని విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని కోరారు.
ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని వామపక్ష విద్యార్ధి సంఘాల నాయకులు కోరారు. మహిళా విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టి ప్రతి విద్యాసంస్థలో ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని, జాతీయ విద్యా విధానం (ఎస్ఈపీ-2020) అమలును నిలిపివేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కెజీ నుంచి పిజి వరకు విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామని, ఈ బంద్ కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రజలు, తల్లిదండ్రులు, మేధావులు సహాకరించి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా ఇంచార్జ్ పసులేటి వెంకటేష్, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లాల శ్రీకాంత్, జిల్లాధ్యక్షులు రెడ్డి చరణ్, జిల్లా ఉపాధ్యక్షులు సికిందర్, SFI జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్, AISB జిల్లా అధ్యక్షులు డీకొండ జతిన్ తదితరులు పాల్గొన్నారు.






