calender_icon.png 9 August, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి X కేటీఆర్

09-08-2025 01:20:31 AM

కేసీఆర్‌తో రేవంత్.. కుమ్మక్కు

  1. అందుకే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల అరెస్ట్‌కు నై
  2.   6,500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది
  3. సొంత బిడ్డ కవిత ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు
  4. కేసును సీబీఐకి అప్పగించాలి
  5. గ్రూప్-1 పేపర్ లీక్ కేసులో జడ్జీ ఫోన్లు కూడా ట్యాప్ 
  6. సిట్ విచారణ అనంతరం కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఆగస్టు 8 (హైదరాబాద్): ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రత దృష్ట్యా వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీబీఐకి లేఖ రాస్తే విచారించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల ముందు శుక్రవారం ఆయన దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజర య్యారు. సుమారు గంటసేపు సాగిన విచారణలో ఆయన పలు కీలకమైన అంశాలను దర్యాప్తు అధికారులకు తెలిపారు. అలాగే పలు డాక్యుమెంట్లను సైతం అందజేశారు. విచారణ అనంతరం మీడియాతో సంజయ్ మాట్లాడారు. 

సీబీఐ నేరుగా రాష్ర్టంలో విచారణ జరిపే అవకాశం లేదని, కేసీఆర్ పాలనలోనే సీబీఐ రాకుండా జీవో తెచ్చారని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలు, రాష్ర్ట ప్రభుత్వం కోరకుండా నేరుగా సీబీఐ విచారణ జరిపే అవకాశమే లేదన్నారు. ఒకవేళ సీబీఐ విచారణ నేరుగా జరిపే అవకాశముం టే, ఈపాటికే కేసీఆర్, కేటీఆర్‌ను గుంజుకుపోయి జైళ్లో వేసే వాళ్లమని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి మాత్రం వారితో కుమ్కక్కు విచారణ పేరుతో జాప్యం చేస్తున్నాడని ఆరోపిం చారు.

అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఫోన్ ట్యాపింగ్‌పై చర్చిస్తామని చెప్పడం నాన్చుడు వ్యవహారంగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన బాధితుడినని, అందుకే సిట్ విచారణలో భాగంగా పోలీసులు పిలిస్తే మళ్లీ విచా రణకు హాజరవుతానని బండి తెలిపారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

 వాటా కోసమే రేవంత్ తానా తందానా

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంతటి ఘోరాలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం, సీ ఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవ డం లేదని సంజయ్ ప్రశ్నించారు. ఈడీ విచారణ కోసం లేఖ ఎందుకు రాయలేదన్నారు. ఇప్పుడున్న సిట్ అధికారులు నిజాయితీగా విచారణ చేస్తున్నారని, వాళ్లపై తమ కు అనుమానం లేదన్నారు. కానీ రేవంత్‌రెడ్డిపై మాత్రం అనేక అనుమానాలున్నా య న్నారు.

ఏళ్ల తరబడి విచారణ చేస్తున్నా, అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నా కేసీఆర్‌ను, ఆ యన కొడుకుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వాళ్లను పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదన్నారు. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఎన్నికల ముందు ప్రకటించిన రేవంత్‌రెడ్డిని పిలిచి విచారణ చేసే అధికారం, దమ్ము సిట్‌కు ఉం దా అని ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకుంటే, ఆ సొమ్ములో వాటా కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న ట్లు కన్పిస్తోందని ఆరోపించారు. ఆ సొమ్ము ను ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టాలనుకుంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే కేసీఆర్ తానా అంటే రేవంత్ తం దానా అంటున్నారని... ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ చెప్పిందే రేవంత్ రెడ్డి చెబుతున్నాడన్నారు.

కేసీఆర్‌కు రేవంత్ క్లీన్ చిట్ ఇస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అందుకే ఆయనను అరెస్ట్ చేయబోమని చెబుతున్నట్లు తెలుస్తోందన్నారు. దర్యాప్తు అధికా రులు చేయాల్సిన పనిని సీఎం ఎందుకు చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. అలాంటప్పు డు ఈ కమిషన్లు, ఈ విచారణలు ఎందుకన్నారు. తాము మొదటి నుంచి చెబుతున్న ట్లుగా... కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని తేలిందన్నారు.

విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఏడాదిన్నరగా టైం పాస్ చేస్తున్నారే తప్ప కేసీఆర్ కుటుంబంపై ఏ చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు కాబట్టే సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో లీగల్ సెల్ నాయకులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. 

మావోయిస్టుల పేరు ట్యాపింగ్ 

తన ఫోన్లను ప్రతి క్షణం ట్యాప్ చేసినట్లు తేలిందని, ఇది తనను షాక్‌కు గురి చేసిందన్నారు. మావోయిస్టుల పేరు చెప్పి తనతో పాటు రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. మొట్టమొదట ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని బయట పెట్టింది కూడా తానేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరి పించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తాము ప్రశ్నిస్తే తమపై ఆ రెండు పార్టీలు ఎదురు దాడి చేస్తున్నట్లు ఆరోపించారు.  

 ముందే పోలీసులకు తెలిసేది

సిట్ పోలీసులు ఫోన్ ట్యాప్ వివరాలు వెల్లడిస్తూ చెప్పిన విషయాలను చూసి షాక్ అయ్యానని సంజయ్ తెలిపారు. తాను పార్టీ పరంగా ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఏం చేయాలని భావించినా ముందే అప్పటి పోలీసులకు తెలిసిపోయేదన్నారు. మా సిబ్బందికి ఫోన్ చేసి మీరు ఫలానా ప్రోగ్రాం పెట్టుకున్నారట కదా అని పోలీసుల అడిగేవాళ్లని, అదంతా ఫోన్ ట్యాపింగ్ వల్లే అని ఇప్పుడు అర్థమవుతోందన్నారు.

అందుకే కేసీఆర్ పాలనలో అందరూ వాట్సాప్ కాల్ మాత్ర మే మాట్లాడుకునే వాళ్లమన్నారు. ఎస్‌ఐబీ అంటే మావోయిస్టు, టెర్రరిస్టుల కార్యకలాపాలను తెలుసుకుని నియంత్రించడానికి ఏర్పడ్డ వ్యవస్థ అని, కానీ దానిని అడ్డం పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్ తమలాంటి రాజకీయ నాయకులందరి ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు వంటి దుర్మార్గమైన పోలీ సు అధికారుల తీరు చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు.

వాళ్లకు ఉరిశిక్ష సరిపోదని, క్షణక్షణం చేసిన పాపాలు తలుచుకుని ఏడ్చేలా శిక్ష విధించాలన్నారు. రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును ఎస్‌ఐబీలో ఎట్లా కొనసాగిస్తారని, ఎన్నో రహస్యాలుంటాయి కదా అని హోంశాఖ ప్రశ్నిస్తే.. ప్రభాకర్‌రావును ఐజీ అని తప్పుగా చెబుతూ నియమించారని బండి తెలిపారు. మావోయిస్టులు, తీవ్రవాదులకు సంబంధించి సేకరించిన ఫోన్ ట్యా పింగ్ ఆధారాలను ప్రతి ఏటా జనవరి, జులై నెలలో డిలీట్ చేయాలని హోంశాఖ ఖచ్చితమైన ఆధారాలు జారీ చేసినా ఏనాడూ కేసీఆర్ పాటించలేదన్నారు. 

  2 గంటల పాటు ట్రాఫిక్ జాం

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం కేం ద్ర మంత్రి బండి సంజయ్ బంజరాహిల్స్‌లోని తన నివాసం నుంచి ఖైరతాబాద్ హ నుమాన్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసి సిట్ విచారణ జరిపే రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న దిల్‌ఖుషా గెస్ట్‌హౌస్ వరకు పాదయాత్రగా బయలుదేరారు. ఆయన వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ సర్కిల్ సహా రాజ్‌భవన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 

రేవంత్‌కు నోటీసులు జారీ చేయాలి

రేవంత్‌రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని, ఆ ఆధారాలు సిట్ పోలీసుల వద్ద ఉన్నాయని తెలిపారు. అందుకే రేవంత్‌రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సిట్ ఎదుట హాజరై రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇవ్వాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, ఎంపీ సంతోష్ ఫోన్లు మాత్రమే బీఆర్‌ఎస్‌లో ట్యాప్ కాలేదని, ఆఖరికి బిడ్డ, మేనల్లుడు హరీశ్‌రావు ఫోన్లను కూడా ట్యాప్ చేశారని,  కేసీఆర్ సంగతి తెలిసే హరీశ్ ఏడాది పాటు ఫోన్ కూడా వాడలేదని తెలిసిందన్నారు. అప్పటి మంత్రు లు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోన్ల ను కూడా ట్యాప్ చేశారని, కేసీఆర్ ప్రభుత్వం వావివరసలు కూడా మర్చిపోయి ట్యాప్ చేసిందని ఆయన మండిపడ్డారు.

6,500 మంది ఫోన్లు ట్యాపింగ్

 తన ఫోన్లతోపాటు సిబ్బంది, తన కుటుంబం, పని వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, దాదాపు 6,500 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఎస్‌ఐబీని అడ్డాగా మార్చి రాజకీయ నాయకులు, వ్యాపారుల, సినిమా వాళ్లు సహా ప్రొఫెసర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. గ్రూప్-1 పేపర్ లీక్‌కు సంబంధించి ఆందోళన కార్యక్రమం గురించి ఫోన్లో మాట్లాడు కుంటే ట్యాప్ చేసి ముందే పోలీసులు తమ ఇంటికి వచ్చి అడ్డుకున్నారని తెలిపారు.

గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసును విచారించిన జడ్జి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారంటే కేసీఆర్ ఎంతటి నీచానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వద్ద గత ఎన్నికల సమయంలో రూ.7 కోట్లు సహా గత ఎన్నికల సమయం లో కాంగ్రెస్ నేతల వద్ద రూ.వందల కోట్లు పట్టుకున్నారని, ఆ డబ్బులన్నీ ఏమయ్యా యో తెలియదన్నారు. రూ.20 కోట్లు పట్టుకుంటే అందులో రూ.18 కోట్లు మాయం చేశారని ఆరోపించారు.

క్షమాపణ చెప్పు.. లేదూ కోర్టుకీడుస్తా

  1. కేంద్ర మంత్రి సంజయ్‌కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
  2. ట్యాపింగ్ వ్యవహారంలో బండివి చిల్లర ఆరోపణలు
  3. ఒక్క శాతం నిజమున్నా నిరూపించాలి..
  4. జోకర్‌గా మారిన సంజయ్ 
  5. కేంద్ర మంత్రి అంటే చెప్పులు మోసినంత ఈజీ కాదని ఎద్దేవా

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని హద్దులు దాటి మినిమం కామన్ సెన్స్ లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్ స్థాయి ఆరోపణలు చేయడం బండి అలవాటుగా మార్చుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయాల్లో చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

48 గంటల్లో క్షమాపణ చెప్ప కుంటే కోర్టుకు ఈడుస్తానని శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కేంద్రమంత్రిగా ఉన్న బండికి నిఘా వ్యవస్థల పనితీరు, విధానాలపై కనీస అవగాహన, పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా లేదని విమర్శించారు. “కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోసినం త ఈజీ కాదని బండి సంజయ్ ఇప్పటికైనా గ్రహించాలి” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ అం శంపై మాట్లాడిన ప్రతిసారి సంజయ్ మరింత దిగజారుతున్నారని ధ్వ జమెత్తారు.  

లీగల్ నోటీసు పంపిస్తున్నా

సంజయ్ ఆరోపణల్లో ఒక్క శా తం నిజం ఉన్నా నిరూపించాలన్నారు. తక్షణమే ఆ ఆరోపణలను ఉపసంహరించుకుని బహి రంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ చేసిన ఆరోపణల పైన లీగల్ నోటీసు పంపిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎంత సున్నితమైనదో, చట్టపరంగా ఎంత కఠినమైనదో సం జయ్‌కు తెలవకుండానే, కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తూ, సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.