19 April, 2026 | 6:19 AM

బ్యాంకు ఉద్యోగాల క్యాంపస్ డ్రైవ్

01-04-2025 01:24 AM

జగిత్యాల, మార్చి 31 (విజయక్రాంతి): కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీఅరుణోదయ డిగ్రీ కళాశాలలో బుధవారం బ్యాంకు ఉద్యోగాల క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ పోతని నవీన్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కొరకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12 సార్లు క్యాంపస్  డ్రైవ్ నిర్వహించి సుమారు 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని వివరించారు.

అదేవిధంగా ఈ నెల 2 బుధవారం రోజున 13వ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. శ్రీఅరుణోదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో  బుధవారం ఉదయం 10 గంటలకు యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉద్యోగాల కొరకు తమ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కోరుట్ల పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని వారు కోరారు. మరిన్ని వివరాల కోసం 8106764653 నెంబరుకు సంప్రదించాలని, గ్రాడ్యుయేషన్ పూర్తయిన 30 సంవత్సరాల వయసు  లోపు వయస్సు కలవారు ఎస్సెస్సి , ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లతో పాటూ ఆధార్ కార్డు, రెస్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి రావలసిందిగా ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్ కోరారు.