06-02-2026 12:39:59 AM
కుషాయిగూడలో ర్యాలీ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్
కుషాయిగూడ, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బార్ అసోసియేషన్కు చెందిన యువతి అడ్వకేట్ కుమారి స్వప్న దారుణ హత్యను తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ల సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కుషాయిగూడలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఉదయం 11.00 గంటలకు కుషాయిగూడ కోర్టు నుంచి ఈసీఐఎల్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహక కమిటీ సభ్యు లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, ఈ కేసులో డీజీపీ స్థాయిలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం కుషాయిగూడ ఏసిపికి వినతిపత్రం అందజేశారు. అలాగే ఈ ఘటనపై డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ కుషాయిగూడ సీఐ భాస్కర్ రెడ్డికి కూడా వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ల సమాఖ్య నాయకులు మాట్లాడు తూ.. ఈ హత్య న్యాయవృత్తికి, న్యాయవ్యవస్థకు తీవ్ర మచ్చగా పేర్కొన్నారు. రాష్ట్ర బార్ అసోసియేషన్ల సమాఖ్య అధ్యక్షులు ఎన్. అమరేందర్ రెడ్డి, కార్యదర్శి బాపిరెడ్డి, జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మి, వెంకటేష్, మురళి, లేడీ సెక్రటరీ రేణుక పాల్గొన్నారు.