నేటి సమాజానికి ఆదర్శం బసవేశ్వరుడు
- సబ్బండ వర్గాల శ్రేయస్సుకు కృషి చేయడమే ఆయనకు నివాళి
- బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): తన సాహిత్యం ద్వారా, సమాజంలో అవగాహన, సంస్కరణలకు బాటలు వేసి, సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు గౌరవం అనే మహత్తర సూత్రాలను ప్రతిపాదించి, ఎనిమిది దశాబ్దాల క్రితమే అమలుచేసిన బసవేశ్వరుని దార్శనిక కార్యాచరణ నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నదని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
భారత సామాజిక న్యాయ దార్శనికుడు, మానవతావాది, బసవేశ్వరుని జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన మార్గదర్శకత్వం, సామాజిక కృషిని సోమవారం కేసీఆర్ స్మరించుకున్నారు. కులం, వర్ణం, లింగం రూపంలో దేశంలో కొనసాగుతున్న వివక్షాపూరిత, అమానవీయ మానవ సంబంధాలు రద్దుకావాలని, సమానత్వ భావన ఫరిడవి ల్లాలని, పోరాడిన మానవతా వాది, సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అని కొనియాడారు.
త్యాగాలతో సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలి పదేం డ్ల బీఆర్‌ఎస్ పాలనలో, బసవేశ్వరుని స్ఫూర్తితో అమలుచేసిన ప్రగతి కార్యాచరణ, దళిత బహుజన సమాజాల జీవితా ల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేసిందని పేర్కొన్నారు.
తద్వారా సబ్బండ కులాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి, వారి ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి బోధనలను అనుసరించి, సమానత్వం, మానవతా విలువలను కాపాడే దిశగా కృషి చేయాలని కోరుకున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడం అనే ప్రాధాన్యతలతో పాలన కొనసాగించడం ద్వారానే బసవేశ్వరునికి మనం అందించే ఘన నివాళి అని చెప్పారు.






