21 April, 2026 | 3:17 AM

చిలుకూరులో ఘనంగా బసవేశ్వర జయంతి

21-04-2026 01:20 AM

మొయినాబాద్ ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కులమతాలకు అతీతంగా సమానత్వాన్ని కోరుకున్న మహనీయుడు బసవేశ్వరుడు అని, ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని వీరశైవలింగాయత్ సమాజం మండల అధ్యక్షుడు, చిలుకూరు మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో ఉన్న కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే చిలుకూరు సమీపంలోని పురాతన శివాలయంలో గత 25 ఏళ్లుగా నిత్య పూజలు చేస్తున్న శివభక్తుడు గున్నాల అంజిరెడ్డిని సన్మానించారు. దూపదీప నైవేద్యాలు, పూజా కైంకర్యాల నిర్వహణకు అవసరమైన సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పురాణం వీరభద్రస్వామి మాట్లాడుతూ, శివపూజ, శివస్పర్శ ఎవరికైనా సాధ్యమని బసవేశ్వరుడు తన జీవితంలోనే ఆచరణలో పెట్టారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వీరశైవలింగాయత్ సమాజ నాయకులు చాట్ల బిక్షపతి, సంఘమేశ్వర్, బస్వరాజ్, వజ్రలింగం తదితరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.