calender_icon.png 6 December, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిడ్డ మరణం పాలకుల పాపమే

06-12-2025 12:54:32 AM

బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్

ముషీరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): బీసీ బిడ్డ సాయి ఈశ్వరచారి మరణం పాలకుల పాపమేనని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలరాజు గౌడ్, ఎస్సీ, ఎస్టీ జాక్ చైర్మన్ విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అంబాల నారాయణగౌడ్ హాజరయ్యారు.

బాలరాజుగౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా బీసీ బిడ్డ ఆత్మబలిదానం చేయాల్సి వచ్చిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం లేదని సాయి ఈశ్వర చారి బలిదానానికి సిద్ధపడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని అన్నారు. మొదటి ముద్దాయి రేవంత్‌రెడ్డి, మిగతా ముద్దాయిలు క్యాబినెట్ మంత్రులు అన్నారు.

తక్షణమే బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి బయటికి రావాలన్నారు. కుల గణన పేరుతో, అసెంబ్లీ తీర్మానం, 150 కోట్ల రూపాయలు విడుదల, 9 జీఓ, ఆర్డినెన్స్ పేరుతో రకరకాల రాజకీయ విన్యాసాలతో కాలయాపన చేసి 17 శాతం రిజర్వేషన్‌కి పరిమితం చేసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాంగ్రెస్ పార్టీ నయ  వంచన చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయి ఈశ్వరచారి మరణనానికి కారకులు అయ్యారన్నారు.

సాయి ఈశ్వరచారికి కుటుంబానికి కోటి రూపాయలు ఆర్ధిక సహాయం చేసి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ యెలికట్టె విజయ్ కుమార్‌గౌడ్, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైర్ల శేఖర్, దామోదర్ గౌడ్, నగేష్, బోయ గోపి, గడ్డమీది విజయ్ హర్షవర్ధన్, మధు సుధన్ చారు నాగభూషణం పాల్గొన్నారు.