calender_icon.png 6 December, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి మరణం ప్రభుత్వ హత్యే

06-12-2025 12:55:30 AM

-బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

-బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

ముషీరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): సాయి ఈశ్వరాచారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన విద్యానగర్ బీసీ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగ రుషి అరుణ్‌కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లనే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలహీన వర్గాల యువత, విద్యార్థుల మరణాలు పరంపరగా కొనసాగుతున్నాయని, ఇది నియంతృత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. హామీలను నెరవేర్చని ప్రభుత్వాన్ని వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు రావాలని, ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ర్యాగ రుషి అరుణ్‌మార్ మాట్లాడుతూ.. ఇంకా ఎంత మంది తమ హక్కుల సాధన కోసం ప్రాణాలు తీసుకోవాలా అని ప్రశ్నించారు.

హక్కులు సాధించే వరకు అవిశ్రాంతంగా ఉద్యనిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అజెండా అంటే ఇదేనా? అని అరుణ్ విమర్శించారు. బీసీ హక్కుల సాధనకు  ఢిల్లీ వేదికగా ఐక్య కార్యాచరణ చేపడతున్నామని,  ఏఐసీసీ కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జాతీయ వైస్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, జాతీయ కన్వీనర్ సి. రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, ఓయు జేఏసీ నేత రాజు నేత, అనురాధ గౌడ్, జి. పద్మ తదితరులు పాల్గొన్నారు.