ఆ ఓటములపై బీసీసీఐ ఆగ్రహం
కీలక ఆటగాళ్ళ గాయాలపై అసంతృప్తి
రోహిత్ రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదన్న సైకియా
వాడీవేడిగా రివ్యూ మీటింగ్
హాజరైన గంభీర్, లక్ష్మణ్, గిల్, శ్రేయాస్
సమావేశానికి అగార్కర్ డుమ్మా
భారత్ క్రికెట్ జట్టు ప్రదర్శనపై బీసీసీఐ సమీక్షా సమావేశం హాట్ హాట్‌గా సాగింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో ఘోర పరాజయాలు, ఆటగాళ్ళ వరుస గాయాలు, 2027 వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించిన రూట్ మ్యాప్ పైనా బీసీసీఐ చర్చించింది. ఈ సందర్భంగా ఇంజ్యూరీ మేనేజ్ మెంట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో రోహిత్ రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదని దేవజీత్ సైకియా చెప్పినా భవిష్యత్తుపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ముంబై, సెప్టెంబర్ 3: టీమిండియా(Team India) ఇటీవల చవిచూసిన వరుస పరాజయాలు, ఆట గాళ్ల ఫిట్నెస్ సమస్యలపై బీసీసీఐ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిం ది. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Head Coach Gautam Gambhir), కెప్టెన్లు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ నేరుగా పాల్గొన్నారు.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ మీటింగ్‌కు నేరుగా హాజరు కాలేదు. ఊహించినట్టుగానే ఈ సమావేశం వాడీ వేడిగా సాగింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఆడిన ఆరు టీ20 మ్యాచ్‌లలోనూ భారత్ క్లీన్‌స్వీప్ అవ్వడంపై బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీ లంకతో జరిగిన రెండో టెస్టులో గెలిచే అవకాశం ఉన్నా డ్రా గా ముగించడంపై గంభీర్, అగార్కర్లను బోర్డు నిలదీసింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఇచ్చిన వివరణపై బోర్డు సం తృప్తి చెందలేదని సమాచారం.
నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించాలని కోచింగ్ స్టాఫ్‌ను ఆదేశించా రు. వచ్చే న్యూజిలాండ్ ఆల్-ఫార్మాట్ ప ర్యటనలో విజయం సాధించి ఫైనల్ రేసులో పుంజుకోవాలని జట్టును ఆదేశించారు. ప్ర స్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పా యింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది.
రోహిత్ శర్మ భవితవ్యంపై చర్చ...
39 ఏళ్ల రోహిత్ శర్మను 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో కొనసాగించాలా వ ద్దా అనే దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వన్డే వరలల్‌కప్ టోర్నీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఊహాగానాలు వినిపించాయి. రిటైర్మెంట్ తీసుకునే లా అతడిపై ఒత్తిడి పెరిగిందనే రూమర్లు వినిపించాయి. అయితే రోహిత్ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడని. వదంతులకు ఆజ్యం పోయాలనుకోవడం లేదని చెప్పారు.
అతడు అన్ని మ్యాచ్‌లలోనూ మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడని, అయినా ఇంకా ఎందుకీ ప్రచారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అయితే, వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రోహిత్‌ను కచ్చితంగా ఆడిస్తామని మాత్రం సైకియా చెప్పలేకపోయారు. ఇదిలా ఉంటే.. అజిత్ అగార్కర్ సమావేశానికి హాజరుకాకపోవడంపై కూడా సైకియా స్పందించారు. మీటింగ్ గురించి ముందుగా సమాచారం ఇవ్వలేకపోయామని.. అందుకే అగార్కర్ రాలేదని పేర్కొన్నారు. అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుండగా, దీనిని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.






