బీసీసీఐ 51 కోట్ల నజరానా
-ట్రోఫీతో పాటు ప్రైజ్‌మనీ రూ.42 కోట్లు
-చాంపియన్లపై కాసుల వర్షం
ముంబై, నవంబర్ 3 : మహిళల వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి గెలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లుతో పాటు కాసుల వర్షం కూడా కురుస్తోంది. ఈ మెగా టోర్నీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా భారత జట్టుకు భారీ ప్రైజ్‌మనీ దక్కింది. గత ఎడిషన్(2022)తో పోలిస్తే ఈ సారి ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచింది. మొత్తం టోర్నీకి 122.49 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే 2022 ఎడిషన్‌తో పోలిస్తే 297 శాతం పెరిగింది. జైషా వచ్చిన తర్వాత పురుషుల జట్టు కంటే ఎక్కువగా ప్రైజ్‌మనీని కేటాయించారు. చాంపియన్‌గా నిలిచిన భారత్‌కు ప్రైజ్‌మనీ రూపంలో రూ.40.92 కోట్లు లభించాయి.
2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అప్పుడు వచ్చింది రూ.35.1 కోట్లే. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికాకు రూ.19.76 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఇదిలా ఉంటే తొలిసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ కూడా భారీ నజరానా ప్రకటించింది. రూ.51 కోట్ల రూపాయలను క్యాష్ ప్రైజ్‌గా ఇవ్వనున్నట్టు బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా చెప్పారు. ఈ మొత్తాన్ని ప్లేయర్స్‌కు, సపోర్టింగ్ స్టాఫ్‌తో పాటు సెలక్షన్ కమిటీకి అందజేయనున్నారు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత జరిగిన విషాద ఘటనతో బీసీసీఐ ఎలాంటి విజయోత్సవ ర్యాలీ లకు అనుమతించడం లేదు. దీంతో త్వరలోనే ముంబైలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జట్టును సత్కరించనున్నారు.
సూరత్ వ్యాపారి డైమండ్ నెక్లెస్‌లు గిఫ్ట్
ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో రారాణులుగా నిలిచిన భారత జట్టుపై దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సూరత్‌కు చెందిన ప్రముఖ బిజినెస్‌మ్యాన్, రాజ్యసభ ఎంపి గోవింద్ ఢోలాకియా మహిళా క్రికెటర్లందరికీ ప్రత్యేక కానుకలు ఇవ్వనున్నారు. వారి విజయానికి గుర్తు డైమెండ్ నెక్లెస్‌లను గిఫ్ట్‌గా అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే క్రికెటర్లందరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమరాష్ట్రానికి చెందిన బౌలర్ క్రాంతి గౌడ్‌కు కోటి నజరానా ప్రకటించింది.




