3 June, 2026 | 1:48 AM

బీసీలు నిర్ణేతలుగా మారాలి

03-06-2026 12:00 AM

డా. పర్వతం వెంకటేశ్వర్ :

తెలంగాణ రాజకీయాల్లో బీసీ నాయకత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్గత, -బాహ్య వ్యూహాలు ప్రస్తుతం బలమైన చర్చనీయాంశంగా మారా యి. బ్రిటిష్ కాలం నాటి ‘విభజించి పాలించు’ వ్యూహాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయనే అభిప్రాయం వాస్తవానికి దగ్గరగా ఉంది. బీసీల్లో అనేక ఉపకులాలు ఉండటం వల్ల వారి మధ్య ఐక్యతకు అడ్డుకట్టలు వేయడం, ఒకరిపై ఒకరిని ఉసిగొల్పడం ద్వారా వారి రాజకీయ బలాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, శ్రీనివాస్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ వంటి నాయకులు వేర్వేరు పార్టీలకు చెందినప్పటికీ, సమాన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాజకీయాలు వ్యక్తిగత కక్షసాధింపులు, వ్యూహాత్మక అణచివేతలకు వేదికగా మారుతున్నాయి. తెలంగాణలో రాజకీయ అధికారం చారిత్రకంగా వెలమ, రెడ్డి సామాజిక వర్గాల మధ్యే తిరుగుతూ వచ్చింది. బీసీలు (యాదవులు, గౌడ్‌లు, ముదిరాజులు, మున్నూరుకాపులు, పద్మశాలి, బెస్త వంటి వందలాది ఉపకులాలు) జనాభాలో దాదాపు 40 శాతానికి పైగా ఉన్నప్పటికీ, రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారు.

రజనీ కొఠారి, ప్రొఫెసర్ జీ రాంరెడ్డి వం టి విశ్లేషకులు చెప్పినట్లు, కులం ఇప్పుడు ఓటర్ల సమీకరణ, కూటములు, ఎన్నికల బేరసారాలకు ముఖ్య సాధనంగా మారిపోయింది. 2014 తర్వాత తెలంగాణలో వెలమ సమాజం రాజకీయంగా బలపడింది. రెడ్డి, వెలమ ఆధిపత్యం కొనసాగుతుండగా, బీసీలు ఓటుబ్యాంకుగా మిగిలిపోతున్నారు. ఇది దళిత, బీసీ వర్గాలను రాజకీయ పావులుగా మార్చే ఆందోళనకరమైన వాస్తవం. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన అగ్రెసివ్ మాస్ లీడర్.

ఆయన పార్టీని బలోపేతం చేసినా, తర్వాత పదవి మార్పులు, కుటుంబ వివాదాలను సాకుగా చేసుకొని ఆయన ఇమేజ్‌ను దెబ్బతీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ వర్గాలు మీడియా ట్రయల్ ద్వారా కక్షసాధింపు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక నుంచి ఈటల రాజేందర్ బలమైన మాస్ ఫాలోయింగ్‌తో ఎదిగారు. క్లీన్ ఇమేజ్, సామాజిక అవగాహన ఆయనకు బలం. కానీ, ఆయన పెరుగుతున్న ప్రాధాన్యత సొంత పార్టీలోని కొందరికి, ప్రత్యర్థి పార్టీలకు నచ్చడం లేదు.

ధర్మపురి అరవింద్‌తో కలిసి పనిచేయడం కూడా కొందరికి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. బీసీ నాయకుడిని పదవిలో ఉంచి బలహీనపరచడం ద్వారా భవిష్యత్ ముఖ్యమంత్రి రేసులో పోటీని తొలగించుకోవాలనే వ్యూహం ఈ దాడుల వెనుక కనిపిస్తోంది. గాంధీభవన్‌లోని అంతర్గత విభేదాలు ఈ దాడులకు ఆజ్యం పోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీ నాయకులు కేవలం పదవులు, టికెట్లతో తృప్తిపడకుండా రాజకీయ నిర్ణేతలుగా మారాలి.

అగ్రవర్ణాల ‘ఉచ్చు’ నుంచి బయటపడి, స్వతంత్రంగా వ్యూహాలు రచించాలి. ఈ క్రమంలో వందలాది ఉపకులాల మధ్య ఐక్యతను ఏర్పరచుకోవడం కీలకం. ఒక ఉపకులం నాయకుడిని మరొక ఉపకులంతో పోల్చి ఐక్యతను బలహీనపరచే వ్యూహాలను అధిగమించాలి. ఆర్థిక బలం, సొంత మీడియా, సోషల్ మీడియా నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాల నాయకులు చేసినట్లు, ప్రధాన పార్టీలపై సామాజిక ఒత్తిడి చేసే గ్రూపులుగా మారాలి.

ప్రతి సీనియర్ బీసీ నాయకుడు యువ బీసీ నాయకులను ప్రోత్సహించి ‘నాయకత్వ శృంఖలాల’ను సృష్టించాలి. ‘అధికారం అడిగితే రాదు, లా క్కుంటే వస్తుంది’ అన్న అంబేద్కర్ మాటను స్ఫూర్తిగా తీసుకోవాలి. పార్టీలకతీతంగా బీసీలంతా ఒకే వేదికపైకి రావడానికి చాణక్యం అవసరం. బీసీ నాయకులు పార్టీ ఎజెండాలకు మించి, సామాజికవర్గ ప్రయోజనాలు, స్వీయ రాజకీయ మనుగడ కోసం వ్యూహాత్మకంగా ఆలోచించాలి. ప్రత్యర్థి కుయుక్తులను పసిగట్టి, స్వతంత్రంగా రాజకీయ చక్రం తిప్పగలిగినప్పుడే ఈ అణచివేతల నుంచి శాశ్వత విముక్తి సాధ్యమవుతుంది.

 వ్యాసకర్త: ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్