3 June, 2026 | 1:47 AM

చదువు‘కొనే’ రోజులు

03-06-2026 12:00 AM

మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో చదువుకునే రోజులు పోయి, చదువు‘కొనే’ రోజులు రావడం ఆందోళనకరం. పేద, మధ్యతరగతి ప్రజల బతుకులను మార్చాల్సిన విద్య నేడు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజుల కారణంగా వారి బతుకులను ఆర్థికంగా చిదిమేసే సాధనంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో సేవలా ఉండా ల్సిన విద్య పూర్తిగా వ్యాపారంలా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏటా ఫీజులను గణనీయంగా పెంచుతుండటం, పుస్తకాలు, నోటుబుక్‌లు, యూనిఫామ్‌లు, బస్సు రవాణా లాంటివన్ని కలగలిసి తల్లిదండ్రుల కు పిల్లల చదువు తలకుమించిన భారంగా మారిపో యింది. మరోవైపు కార్పొరేట్ పాఠశాలలు ప్రత్యేకంగా పుస్తకాలను రూపొందించి, వాటినే కొనుగోలు చేయాల ని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్న పరిస్థి తులను మనం చూస్తూనే ఉన్నాం.

మార్కెట్లో లభించే సాధారణ పుస్తకాలతో పోలిస్తే వీటి ధరలు ఎక్కువగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పరిస్థితి పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది. తమ పిల్లల బతుకులైనా బాగుపడాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అప్పులు చేసి, ఇతర ఖర్చులను తగ్గించుకొని, పస్తులు ఉండి మరీ చదువుల కోసం భారీగా వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో హక్కుగా అందరికీ అందాల్సిన విద్య భారంగా మారుతుండటం గమనార్హం.

అయితే, ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించడం ముదావహం. రెండేళ్లకు ఒకసారి 8 శాతం ఫీజు పెంపును తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించగా, మూడేళ్లకు ఒకసారి 10 శాతం ఫీజుల పెంపును రాష్ట్ర విద్యాకమిషన్ సూచించిన విషయం తెలిసిందే. కానీ, క్షేత్రస్థాయిలో ఈ ప్రతిపాదనలకు విరుద్ధంగా ఫీజులను పెంచుతున్న వైనం కనిపిస్తున్నది. మరోవైపు ఫీజుల పర్యవేక్షణకు ప్రత్యేక్ష కమిషన్, జిల్లాల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్న విద్యా కమిషన్ సిఫారసులు కాగితాలకే పరిమితం కావడం శోచనీయం.

ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రు లపై భారాన్ని తగ్గించాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి బోధన, మెరుగైన వసతులు, అవసరమైన వనరులను అందుబాటులోకి తీసుకొస్తే ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. అప్పుడు విద్య అందరికీ అందు బాటులో ఉంటుంది. సమాజ పురోగతికి, పేద ప్రజల అభ్యున్నతికి చదువు మూలాధారం. అలాంటి విద్య ఆర్థికంగా బలమైన వారికి మాత్రమే పరిమితం కావడం ఏ మాత్రం మంచిది కాదని చెప్పక తప్పదు.