ఏం కొనలేం.. ఏం తినలేం!
పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన మొదట్లోనే పొదుపు చర్యలు పాటించి ఉంటే మరింత ప్రయోజనం చేకూరేది. పొదుపు చర్యలను పేద, మధ్యతరగతి ప్రజలపై రుద్దుతున్న కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని కార్పొరేట్ రంగాలకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను ఇంకా కొనసాగిస్తూనే ఉండటం శోచనీయం.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందనే సామెత నేటి పరిస్థితులను చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభమే దీనికి చక్కటి ఉదా హరణ. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమై నేటికీ కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికాల యుద్దం మొత్తం ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా మన దేశంపై, పేద, మధ్యతరగతి ప్రజలపై అన్ని రకాలుగా తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగటంతో దేశంలోని దాదాపు 80 శాతం జనాభా సతమతమవుతున్నారు. ప్రభుత్వ గణాంకాలు ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 3.48%, టోకు ద్రవ్యోల్బణం 8.3 శాతంగా నమోదైంది. దీన్ని బట్టి చూస్తే ధరలు అమాంతం పెరిగి ఏమి తినలేని, ఏమి కొనలేని స్థాయికి చేరాయి.
మనం గత కొన్ని సంవత్సరాలుగా పరిణామాలను పరిశీలిస్తే, 2016 నుంచి అనగా పెద్ద నోట్ల రద్దు, తదుపరి కొవిడ్, రష్యా యుద్ధం, తాజాగా పశ్చిమాసియా సంక్షోభంతో భారతదేశంలోని సామాన్య ప్రజలపై ఆర్థిక భారం రోజురోజుకి పెరుగుతూ, ఈరోజు అది తారస్థాయికి చేరింది. దేశంలోని అత్యధిక జనాభా నేటికీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అసంఘటిత కార్మికులే. వీరందరూ నిర్మాణ, ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తున్నారు.
ఈ పశ్చిమాసియా సంక్షోభం వల్ల చమురు, గ్యాస్ ధరలు, రవాణా ఖర్చులు పెరగటం, ముఖ్యంగా ముడిసరుకుల దిగుమతులు ఖరీదైనవిగా మారడంతో అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఉపాధి దెబ్బతిన్నది. గత సంవత్సరం పారిశ్రామిక ఉత్పత్తి 5.7 శాతం ఉంటే, నేడు 4.9 శాతానికి పడిపోయింది. ఆ మేరకు ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది.
అలాగే ఇంధన ఆధారిత పరిశ్రమలు, మైనింగ్, తయారీ, నిర్మాణరంగాలు కుదేలవుతున్నాయి. స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతు న్నది. ఈ మూడు నెలల కాలంలో సుమారు 10 వేల పాయింట్లు కోల్పోయింది. విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఒకవైపు గల్ఫ్ దేశాల నుంచి తిరిగి మన దేశానికి అనేక మంది వెనక్కి వచ్చేస్తుంటే, మరోవైపు ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా భారీ ఎత్తున లేఆఫ్‌లతో నిరుద్యోగం పెరుగుతున్నది. తత్ఫలితంగా దేశం ఎన్నడూ లేని విధంగా ఆర్థిక ఒడుదొ డుకులకు గురవుతున్నది. దీంతో ధరలు సామాన్యుడి నడ్డివిరిస్తున్నాయి.
ఇదే సమయంలో పశ్చిమాసియా సంక్షోభంతో ఎరువులు, రసాయనాల దిగుమతులు ఖరీదుగా మారి వ్యవసాయ రంగం కూడా తడబడుతున్నది. దీంతో రైతు లు, రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఉపాధి కోల్పోయి బతుకుదెరువు లేక నిరుద్యోగులు, గిట్టుబాటు ధరల్లేక అన్నదాలు, పనులు దొరక్క శ్రామికులు తనువుచాలిస్తుండటం ఆందోళనకరం. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి.
స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ఉపాధి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై దృష్టిసారించాలి. ఇతర దేశాలపై ఆధారపడటం మానుకొని ఎగుమతులు పెంచి ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలి. తద్వారా ధరాభారం తట్టుకునే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే ప్రపంచంలో ఎక్కడ, ఏ సమస్య వచ్చినా మన దేశం కొన్ని సంవత్సరాల పాటు వణికిపోయే పరిస్థితి ఉంటుందని గ్రహించాలి.
ఈ పరిస్థితులకు ప్రధాన కారణం మన దేశం చమురు, గ్యాస్ నూటికి ఎనభై శాతం ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా దిగుమతి చేసుకోవడమే. ప్రస్తుత యుద్ధ ఉద్రిక్తతల మధ్య హార్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం, చమురు రవా ణా నిలిచిపోయింది.
దీంతో చమురు, గ్యాస్ రవాణాలో జాప్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చమురు కంపెనీలు నష్టాలతో కొనసాగుతున్నాయని గగ్గోలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం దఫదఫాలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూపోతున్నది. దీంతో లక్షల మంది వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా అనేక హోటళ్లు మూతపడ్డాయి. పర్యాటకం దెబ్బతింది. ఫలితంగా ఉపాధి కరువైంది. ఇక అక్కడక్కడ నడుస్తున్న హోటళ్లలో ధరలు రెట్టింపయ్యాయి.
దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కనీసం ‘టీ’ తాగటానికి కూడా భయపడుతున్నారు. ఒక పక్క ఉపాధి అవకాశాలు కోల్పోవడం, మరో పక్క అధిక ధరలతో దేశ ప్రజలు మూడు పూటలా తిండి తినలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మన ప్రధాని పొదుపు చర్యలు ప్రకటించడం విడ్డూరంగా ఉంది.
అసలు పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన మొదట్లోనే పొదుపు చర్యలు పాటించి ఉంటే మరింత ప్రయో జనం చేకూరేది. పొదుపు చర్యలను పేద, మధ్యతరగతి ప్రజలపై రుద్దుతున్న కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని కార్పొరేట్ రంగాలకు, పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రాయితీలను ఇంకా కొనసాగిస్తూనే ఉండటం శోచనీయం. కార్పొరేట్ పన్నులు తగ్గించడం వలన ఖజానాకు కోట్ల రూపాయల గండి పడింది.
పొదుపు చర్యల్లో భాగంగా బంగారం, వెండి వ్యాపారులు, దానిపై ఆధారపడి జీవిస్తున్న సుమారు నలభై లక్ష లు మంది ఉపాధి అగమ్యగోచరంగా తయారైంది. సెస్ సుంకాలు 6% నుంచి ఒకేసారి 15% శాతం మేర పెంచడంతో వెండి, బంగారం విక్రయాలు పడిపోతున్నాయి. ఇన్ని చర్యలు తీసుకున్నా విదేశీ మారక నిల్వలు 728.494 బిలియన్ల డాలర్లు నుంచి 681.384 బిలియన్ డాలర్లకు అంటే, 47.11 బిలియన్ డాలర్లు పడిపోయా యి. సరికదా డాలర్‌తో రూపాయ మారకపు విలువ మరింత క్షీణించి, ఒక దశలో 96.86 కనిష్ఠ స్థాయికి దిగజారింది. జీడీపీ తగ్గుముఖం పట్టింది. త్వరలో ప్రపం చంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని చెప్పుకొంటున్న మన దేశ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఆరో స్థానానికి పడిపోయింది.
దీనికంతటికి ప్రధాన కారణం సకాలంలో మన పాలకులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే అని పలువురు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలపై ధరాఘాతం మోత మోగుతున్నది. తలసరి ఆదాయం, జీవన ప్రయాణాలు క్షీణించాయి. కేవ లం ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత సంక్షేమ పథకాలపై ఆధారపడి బతికే పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా పాలకులు భవి ష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి.
ముఖ్యంగా స్వయం సమృద్ధి సాధించే అవకాశాలపై దృష్టి సారించాలి. సోలార్, విండ్ ఎనర్జీలను అభివృద్ధిపరచి, ఆచరణలో భారీ ఎత్తున అమలు చేయాలి. ఇప్పటికే బొగ్గు గ్యాసిఫికేషన్‌పై దృష్టి సారించారు. అయితే, దీని పట్ల కాలుష్య భయాలు పెరుగు తున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేయాలి. వాస్తవంగా పరిశీలిస్తే అనేక అంతర్జా తీయ సూచీల్లో మన దేశం వెనుకబడి ఉన్నది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని దేశంలో నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, అధిక ధరలు తగ్గించడానికి ప్రభుత్వం చర్య లు చేపట్టాలి.
జెన్ జీ, మిలీనియం యువత ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పార్టీలు, పాలకులు ఆలోచించాలి. ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఆలోచలనతో పాలించకుండా, వాస్తవంగా దేశంలో ఉన్న ప్రజలు ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పు కోసం విధివిధానాలు రూపొందించి, అమలు చేయాలి. తలసరి ఆ దాయం, జీవన ప్రమాణాలు పెరగటం ద్వారానే వికసిత భారత్ సాధ్యమని పాలకులు ఇప్పటికైనా గ్రహించాలి.
వ్యాసకర్త సెల్: 6305682733
ఐ.ప్రసాదరావు






