17 August, 2026 | 3:10 AM

59 నియోజకవర్గాల్లో బీసీల సర్జికల్ స్ట్రుక్

17-08-2026 02:32 AM
  1. రేషన్ కార్డు కాదు.. నాణ్యమైన విద్య, ఉద్యోగాలు, రాజకీయ అధికారం కావాలి 
  2. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఆగస్టు ౧౬ (విజయక్రాంతి): తెలంగాణలో బీసీల రాజకీయ రాజ్యాధికార సాధన కోసం ‘సర్జికల్ స్ట్రైక్-59’ కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్సీ, టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న ప్రకటించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 నియోజకవర్గాలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసి బీసీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ప్రతి పేద కుటుంబంలోని పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలు కల్పించడమే నిజమైన ఆత్మగౌరవమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.9 వేల కోట్లు వెంటనే చెల్లించి విద్యార్థులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల బలం, రాజకీయ పరిస్థితులు, గత ఎన్నికల ఫలితాలు, స్థానిక నాయకత్వం తదితర అంశాలపై డేటాను విశ్లేషించి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.

బీసీల ఓటు బ్యాంకును కేవలం ఎన్నికల సమయంలో ఉపయోగించుకునే రాజకీయాలకు ఇక చరమగీతం పాడాలని మల్లన్న పిలుపునిచ్చారు. ఓటు వేయడం మాత్రమే కాకుండా ఎవరు పోటీ చేయాలి, ఎవరు గెలవాలి, ఎవరు పాలించాలి అనే నిర్ణయంలోనూ బీసీలు కీలక పాత్ర పోషించాలన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యమని తీన్మార్ మల్లన్న ప్రకటించారు.

‘సర్జికల్ స్ట్రైక్-59’ ద్వారా బీసీలను రాజకీయంగా సంఘటితం చేసి, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకత్వాన్ని తయారు చేస్తామని తెలిపారు. కాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల మనోజ్ ఆధ్వర్యంలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌తో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మల్లన్న దిశానిర్దేశం చేశారు.

‘సోషల్ మీడియానే మన ఆయుధం.. ప్రతి పోస్ట్ బీసీల్లో చైతన్యం నింపాలి’ అని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, బీసీల రాజ్యాధికార లక్ష్యం, ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సోషల్ మీడియా వారియర్స్‌పై ఉందన్నారు. కార్యక్రమంలో సోషల్ మీడియా సౌత్ కన్వీనర్ మార్తా శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాల కన్వీనర్లు హర్ష, శ్రీకాంత్, సత్యనారాయణరాజు, సాయి చరణ్ పటేల్, నాంపల్లి జగన్, లతీఫ్ తో పాటు జిల్లా కన్వీనర్లు పాల్గొన్నారు.

హైదరాబాద్ ఇంచార్జ్ భావన వెంకటేష్, హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. కిషోర్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాంనగర్‌కు చెందిన సాయిరాం, సీతాఫల్‌మండికి చెందిన శ్రీనివాస్ చారి, కవాడిగూడకు చెందిన ప్రజాపతి, వినయ్, ఖైరతాబాద్ నుండి రవికుమార్ టీఆర్పీలో చేరారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సాయిని పాపన్న ఆధ్వర్యంలో పలువురు టీఆర్పీలో చేరారు.