సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు జరగాలి
జిల్లా వైద్యాధికారుల సమీక్షలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్, జూన్ 7 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని, మందుల కొరత లేకుండా చూడాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి ఉచితంగా వైద్యం అందాలన్నారు.
మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరీక్షలు జరిపించాలని తెలిపారు. తన సొంత నిధులతో జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్ కేటాయిస్తానని చెప్పారు. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారులను అడిగి ఆరోగ్య కేంద్రాల్లోని సమస్యలు తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.






