15 July, 2026 | 6:51 AM

పన్నుల కోసం పాట్లు! ఎగవేతదారులపై జీహెచ్‌ఎంసీ నజర్

08-06-2024 02:24 AM

గ్రేటర్ పరిధిలో ఇండ్లపై డ్రోన్ సర్వే

నియో జియో ఏజెన్సీతో ఒప్పందం

జీఐఎస్ ద్వారా ఇంటింటి సర్వే 

కమర్షియల్ కేటగిరీలో పెరగనున్న టాక్స్ 

పోలీసుల అనుమతి రాగానే ప్రారంభం 

ఆస్తిపన్ను పెంచుకోవడమే బల్దియా లక్ష్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీ తన కాళ్ల తాను నిలబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గ్రేటర్ అధికారుల్లో నిజాయితీ, చిత్తశుద్ది లోపించడం కారణంగా కమ ర్షియల్ కేటగిరీ నుంచి రెసిడెన్సియల్‌కు రెసిడెన్సియల్ కేటగిరీలోనూ రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు పొంది నాలుగు, ఐదు అంతస్తు లను నిర్మాణం చేయడం కారణంగా బల్దియాకు ప్రాపర్టీ టాక్స్ రావాల్సినంత రావడం లేదు.

జీహెచ్‌ఎంసీకి అప్పులు మోయలేని భారంగా తయా రవుతున్న నేపథ్యంలో బల్దియాకు ప్రతి ఏడాది వచ్చే ప్రాపర్టీ టాక్స్‌ను పెంచుకునేందుకు మూడేళ్లుగా కసరత్తు చేస్తుంది. గ్రేటర్‌లో పన్ను ఎగవేత దారులకు చెక్ పెట్టేందుకు మొత్తం నివాసాలను డ్రోన్ కెమెరాలతో సర్వే చేయించాలని జీహెచ్‌ఎంసీ భావించింది. ఎట్టకేలకు జియోగ్రాఫిక్ ఇన్ఫా ర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) ద్వారా చేపట్టనున్న డ్రోన్ సర్వేకు ఏజెన్సీని ఖరారు చేశారు. 

అదనంగా రూ.600 కోట్ల ఆదాయం

గ్రేటర్ వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలో సుమారు 19 లక్షల నిర్మాణాల ద్వారా ప్రాపర్టీ టాక్స్ వసూలవుతుంది. వీటిలో కేవలం 2.5 లక్షల నిర్మాణదారులు మాత్రమే కమర్షియల్ కేటగిరీలో ఉన్నారు. వీటి ద్వారా 2022 ఆర్థిక ఏడాదిలో రూ. 1660.38 కోట్లు, 2023 ఏడాదికి రూ. 1914.87 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ ఏడాది ఎర్లీ బర్డ్ ద్వారా ఇప్పటికే రూ. 900 కోట్లు వసూలు కావడం జరిగింది. భవన నిర్మాణదారులు నిర్మాణాల సమయంలో రెండు అంతస్తులకు మాత్రమే పర్మిషన్ తీసుకుని నాలుగు, ఐదు ఆపై పెంట్ హౌజ్ అంటూ నగరంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కోకొల్లలు. ప్రభుత్వం నుంచి పొందిన అనుమతి రికార్డు ప్రకారం రెండంతస్తులు మాత్రమే ఉంటున్నందున టాక్స్‌ను ఆ మేరకు మాత్రమే చెల్లిస్తున్నారు.

అక్రమ నిర్మాణాలతో బల్దియా ఆదాయానికి గండికొడుతున్న పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టి, ప్రాపర్టీ టాక్స్ ను పెంచుకోవాలని జీహెచ్‌ఎంసీ మూడేళ్ల క్రితమే భావించింది. అప్పట్లోనే జీఐఎస్ సర్వే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అర్థాంతరంగా నిలిచిపో యింది. అయితే ఈ సర్వే ద్వారా ప్రస్తుతం 19 లక్షల నిర్మాణాలకు అదనంగా తేలే అవకాశం ఉంటుందని, రెసిడెన్సియల్ నుంచి కమ ర్షియల్ కేటగిరీకు దాదాపు 40 శాతం నిర్మాణాలు వచ్చే అవకాశం ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఇప్పుడు వసూల య్యే 1914.87 కోట్లకు అదనంగా మరో రూ. 600 కోట్లు టాక్స్ వసూలయ్యే ఛాన్స్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

ప్రతి నిర్మాణానికి యూనిక్ నంబరు.. 

బల్దియాలో డ్రోన్ల ద్వారా నివాసాలను పక్కాగా లెక్కించేందుకు నియో జియో ఏజెన్సీని ఖరారు చేశారు. ఈ ఏజెన్సీ ముందుగా నగరంలోని ట్రై కమిషనరేట్ల ద్వారా అనుమతులు పొంది ఆ తర్వాత డ్రోన్ల సర్వే చేపడుతుంది. ఈ సర్వేలో భవన నిర్మాణం పొడవు, వెడల్పు, ఎన్ని ఫోర్లు ఉందనే విషయాలను డ్రోన్ కెమెరా ద్వారా రికార్డు చేయనున్నారు. ఈ సమయంలో సర్వే చేపట్టిన ఇంటికి ప్రాపర్టీ టాక్స్ కోసం ప్రత్యేక నంబరును కేటా యించనున్నారు. ఈ ప్రాపర్టీ టాక్స్ నంబరు (పిటిఐఎన్) కు అప్పటికే ఆ ఇంటి నంబరులో ఉండే విద్యుత్ సర్వీస్ నంబరు, వాటర్ బోర్డు నీటి సరఫరా నంబర్లను అనుసంధానం చేయనున్నారు.

దీంతో ఆ నివాసంలో లేదా ఆ నిర్మాణంలో వినియోగించే విద్యుత్ మీటరు, నీటి సరఫరా క్యాన్ నంబరు కమర్షియలా కాదా తేలనుంది. అంతే కాకుండా, సిబ్బంది నేరుగా కూడా వెళ్లి కూడా సర్వే చేయనున్నారు. దీంతో ఇప్పటి వరకూ రెసిడె న్సియల్ కేటగిరీలో టాక్స్ చెల్లించే సర్వే ఆధారంగా కమర్షియల్ కేటగిరీకి మారే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ముందు గా ఈ సర్వే ప్రతి జోన్ పరిధిలో ఒక్కో వార్డులో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఆ తర్వాత గ్రేటర్‌లోని 6 జోన్లలో 30 సర్కిళ్లలో  ఈ సర్వే చేపట్టనున్నారు. నిజానికి ఈ సర్వే ఫలప్రదం అయితే కచ్చితంగా జీహెచ్‌ఎంసీ ఆదాయం భారీగా పెరగనుంది.