05-02-2026 12:00:00 AM
నేడు సోషల్ మీడియాను ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వివిధ అవసరాలకు వినియోగిస్తున్నప్పటికీ కొన్నిసార్లు దుర్వినియోగమవుతున్నది. మూడేళ్ల పిల్లాడి నుంచి పాఠశాల, యూనివర్శిటీ స్థాయి వరకు, ఉద్యోగ స్థాయి నుంచి పని మనిషి స్థాయి వరకు మొబైల్ వాడకంలో మునిగి తేలుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విరివిగా సోషల్ మీడియా యాప్‌లకు బానిసలుగా మారిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, యువతీయువకులు, మహిళలు, వృద్ధులు సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి లైకుల కోసం, షేర్ల కోసం నానా తంటాలు పడుతున్నారు.
నిత్యం అర్ధం పర్థం లేని రీల్స్ చేస్తూ, స్టేటస్‌లు పెడుతూ సమయా న్ని వృథా చేసుకుంటున్నారు. ఫ్రాంక్ వీడియోల పేరుతో నగ్నత్వాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా సహా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే వీడియో గేమ్స్‌కు బానిసలవుతున్న పిల్లలు ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంటుంది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్న పిల్ల లు.. తల్లిదండ్రులు తమకు ఫోన్లు ఇవ్వడం లేదన్న కారణంతో ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి.
తాజా ఘజియాబాద్ ఘటనే ఇం దుకు ఉదాహరణ. ప్రతీ చిన్న విషయానికి మొబైల్ ఫోన్లను ఆశ్రయిస్తుండడంతో మేథస్సుకు పని పెట్టకపోవడంతో మెదళ్లు మొద్దుబారిపోతున్నాయి. ఆన్‌లైన్ గేమ్‌ల కారణంగా శరీరానికి, మనసుకు ఆరోగ్యాన్ని చేకూర్చే క్రీడలు అంతరించిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం యువతను అధోగతి వైపు పయనింపచేస్తున్నది.
సోషల్ మీడియా ప్రభావంతో అశ్లీలత,అసభ్యత పెరిగి జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. చిన్న పిల్లలు సైతం సోషల్ మీడియా ప్రభావానికిలోనై చెడుదారి పడుతున్నారు. యువతలో పెరిగిన మొబైల్ వ్యాపకం, సోషల్ మీడియా నైతిక విలువల పతనం వైపు పరుగులు పెట్టిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో లోపిస్తున్న సంస్కారం సమాజానికి హానికరంగా మారింది.
సత్తిరాజు, తూర్పు గోదావరి