calender_icon.png 5 February, 2026 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ హైడ్రామా!

05-02-2026 12:00:00 AM

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించిన పాకిస్థాన్ హైడ్రామాకు తెరలేపింది. ప్రపంచకప్ లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. ఆ తర్వాత మేజర్ టోర్నీల్లో మాత్రమే ఇరుజట్లు తలపడుతూ వస్తున్నాయి. పాకిస్థాన్‌తో సఖ్యత లేని కారణంగా ఇకపై తటస్థ వేదికల్లో మాత్రమే పాక్‌తో మ్యాచ్‌లు ఆడతామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు బీసీసీఐ తేల్చి చెప్పింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా అందుకు అంగీకరించింది. అప్పటినుంచి భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికల్లోనే జరుగుతున్నాయి. తాజాగా టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్నాయి. ఐసీసీ అనుమతితో పాక్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. అయితే ఉన్నపళంగా భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ పాక్ పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. గతంలో భద్రతా కారణాలరీత్యా 1996, 2003 ప్రపంచకప్‌ల్లో మ్యాచ్‌లు బాయ్‌కాట్ చేస్తామని బెదిరించిన సందర్భాలున్నాయి.

కానీ ప్రస్తుతం పాక్‌కు భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడానికి సరైన కారణం లేదు. కేవలం ప్రపంచకప్ నుంచి బహిష్కరణకు గురైన బంగ్లా జట్టుకు సంఘీభావంగా భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలే అండర్ ప్రపంచకప్, గతేడాది ఆసియా కప్‌లో భారత్ చేతి లో ఓటములను పాక్ అవమానంగా భావించింది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ ఆడకుండా మొండివైఖరితో వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. పాక్ జట్టుపై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇదే జరిగితే పీసీబీ ఆర్థికంగా మ రింత నష్టపోనుంది. ఇక బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత కారణంగా ప్రపంచకప్‌లో తమ భద్రతకు ప్రమాదం పొంచిఉందన్న కారణంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మ్యాచ్‌కు సంబంధించిన వేదికలను మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. మాట వినని ఐసీసీ.. ఆటగాళ్ల, సిబ్బంది భద్రతకు ఎలాంటి ముప్పు లేదని, వేదికలను మార్చేది లేదని తేల్చి చెప్పింది. తమ మాట కాదని ఎపెక్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఐసీసీ.. బంగ్లాదేశ్ జట్టును ప్రపంచకప్ ఆడకుండా నిషేధించింది.

ఒకప్పుడు బద్ధ శత్రువుల్లా మెలిగిన బంగ్లాదేశ్, పాకిస్థాన్ మారిన పరిస్థితుల దృష్ట్యా పరస్పరం ఎనలేని ప్రేమను చూపించుకుంటున్నాయి. గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత సంబంధాలు మరింత క్షీణించడంతో ప్రపంచకప్ సహా మేజర్ టోర్నీల్లో ఇకపై పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చే యకూడదని భారత ఆటగాళ్లకు బీసీసీఐ దిశానిర్దేశం చేసింది. గతేడాది ఆసియా కప్ గెలిచిన టీమిండియా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఇష్టం లేక ఖాళీ చేతులతోనే స్వదేశానికి తిరిగొచ్చింది.

‘భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలన్న నిర్ణయం మాది కాదు,  మాదేశం ఆదేశాలను పాటించడమే తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని పాక్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ పేర్కొనడం కొసమెరుపు. మరోవైపు భారత్‌లో జరిగే షూటింగ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ జట్టు సిద్ధమవ్వగా.. బీసీబీ మాత్రం తమ రాజకీయాలతో ఆటగాళ్లను బలిపశువులను చేసింది.