విద్యార్థుల నోటికాడ ముద్దలో మట్టి కొట్టకండి..
ఆహారం నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి..
హాస్టల్ వార్డెన్ ల సమీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచింది విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వారి నోటికాడి ముద్దలు మట్టి కొట్టవద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీ వసతి గృహాల వార్డెన్ లతో మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల భవనాల పరిస్థితి, మౌలిక సదుపాయాల స్థితి, విద్యార్థిని విద్యార్థుల సంఖ్య, విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం, విద్యార్థుల మానసిక శారీరక ఎదుగుదలకు సంబంధించిన అంశాలపై చర్చించి మాట్లాడారు. విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలకు నాణ్యమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచిన తర్వాత ఆహారం నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు.
భవిష్యత్ తరాలను తయారు చేసే గురుతర బాధ్యత వసతిగృహాల వార్డులపై ఉందని ప్రతి అధికారి గుండె మీద చేయి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకొని కమిట్మెంట్తో పని చేయాలని సూచించారు. ప్రతి హాస్టల్లో ఎదుర్కొంటున్న సమస్యలను వార్డెన్ ల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రాధాన్యత పనుల వారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం తరఫున మంజూరు చేయించి చేసే పనులతో పాటు, సత్వరం ఉపయోగంలోకి వచ్చే పనులను చేయిస్తానన్నారు.మొదటి ప్రాధాన్యత పనుల్లో త్రాగునీరు టాయిలెట్స్, డ్రైనేజీ సిస్టం, దోమలు రాకుండా మెష్ లు సరిగ్గా లేనిచోట వెంటనే కల్పిస్తామన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని తరచుగా విద్యార్థులకు హెల్త్ చెకప్ లు చేయించాలని సూచించారు..
ప్రతి విద్యార్థికి సిబిపి పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించాలన్నారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యార్థిని విద్యార్థుల బరువును చూడాలని ఎదిగే వయసు కావడం వల్ల సరిపడా నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మునుగోడు మండలంలోని ఎస్సీ, బీసీ బాయ్స్ హాస్టల్స్, బీసీ గర్ల్స్ హాస్టల్, చండూరు మండలంలోని ఎస్సీ బీసీ బాయ్స్ హాస్టల్స్, ఎస్సీ గర్ల్స్ హాస్టల్, నాంపల్లి మండలంలోని ఎస్సీ బాయ్స్ ఎస్ సి గర్ల్స్ హాస్టల్స్, గట్టుప్పల్ మండలంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్, మర్రిగూడ మండలంలోని ఎస్టీ ఎస్సీ బీసీ బాయ్స్ హాస్టల్ల వార్డెన్లు ఉన్నారు.






