కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయాలే కాళేశ్వరానికి శాపం
హైదరాబాద్: కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయాలు, ప్రభుత్వ వైఫల్యమే కాళేశ్వరానికి శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి కట్టిన కాళేశ్వరం కూలిందని, గత ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగంపై న్యాయ విచారణ చేపట్టామన్నారు. కమిషన్ నాటి సీఎం, నీటిపారుదల మంత్రి, ఆర్థిక మంత్రితో మాట్లాడిందని, కమిషన్ సమగ్ర నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించిందని ఆయన తెలిపారు.
కమిషన్ నివేదికపై ముగ్గురు అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసిందని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ప్రాజెక్టులు నిర్మించారని, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తపోసి సాగునీళ్లు ఇస్తామని ప్రాజెక్టు చేపట్టారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరిట కేసీఆర్ మార్చారని విమర్శించారు. 2015-16లో చేపట్టిన పనులు 2018-19లో పూర్తి చేసినట్లు గత ప్రభుత్వం చెప్పిందని ఎద్దేవా చేశారు. నిర్మాణం జరిగిన మూడేళ్లలోపలే 2023లో మేడిగడ్డ కుంగిపోయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పగుళ్లు వచ్చాయని, ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని సాంకేతిక నిపుణులు, ఎన్డీఎస్ఏ గుర్తించాయని సీఎం స్పష్టం చేశారు.
ప్రాజెక్టులపై విచారణ చేసి ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలున్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నివేదికలు ఇచ్చారని, ఆనాడు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు ప్రాజెక్టుల పర్యటన చేపట్టారని వెల్లడించారు. లోపభూయిష్ట నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్య వైఖరి గుర్తించామని రేవంత్ రెడ్డి వివరించారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని, ప్రభుత్వం వచ్చాక విచారణకు ఆదేశిస్తామని గతంలో చెప్పామన్నారు.






