16-02-2025 12:00:00 AM
పరీక్షలు దగ్గరపడుతున్నకొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మార్కులతో పాటు వివిధ ప్రవేశపరీక్షల నేపథ్యంలో ఆందోళనకు గురవుతుంటారు. ఫలితంగా అనేక మంది నిద్ర, ఇతర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే పరీక్షలు బాగా రాయాలని, మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని ఎన్నో కలలు కంటారు.
కానీ కొన్నిసార్లు భరించలేని ఆ ఒత్తిడి వారి ప్రాణాలను హరిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలు ఒత్తిడిబారిన పడకుండా ఏం చేయాలి? మానసిక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఏవిధంగా ఉండాలి? అనే విషయాలు తెలుసుకుందాం..
పరీక్షలు అంటేనే విద్యార్థుల్లో ఓ రకమైన భయం. ఉంటుంది. ఎలా చదవాలి? ఏం చదవాలి? పరీక్షలు తప్పితే తల్లిదండ్రులు ఏమంటారోనని ఆందోళనకు గురవుతుంటారు. దేశవ్యాప్తంగా 40శాతంపైగా విద్యార్థులు పరీక్షలు, ఫలితాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పలు సర్వేల్లో కూడా తేలింది.
అలాగే కొంతమంది విద్యార్థులు గంటలకొద్దీ చదువుతూనే గడుపుతుంటారు. దాంతో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా భావోద్వే గాలు, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూ పిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు.
లక్షణాలను గుర్తించండి ఇలా..
* నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం, ఉత్సాహం తగ్గిపోవడం వంటివి విద్యార్థుల్లో డిప్రెషన్‌కు మొదటి గుర్తు.
* భవిష్యత్తు గురించి నిరాశ, అప్రయోజకులం అనే భావన, తమను తామే అసహ్యించుకుంటారు. ఒక్కసారిగా ఆలోచనల్లో మార్పులు రావడం. నలుగురితో కలవకపోవడం, మాట్లాడకపోవడం లాంటి లక్షణాతో ఉంటారు.
* గతంలో ఆనందాన్నిచ్చే ఏ కార్యకలాపాల్లోనూ ఆసక్తి లేకపోవడం, ప్రతిదానికీ చిరాకు పడటం, తరచుగా వాదనకు దిగడం లాంటివి చేస్తుంటారు.
ఒత్తిడిని తగ్గించే మార్గాలు
ఒత్తిడిని జయించే ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. ఆటలు, రాయడం, చదవడం, పెయింటింగ్, ఏదైనా సంగీత పరికరాన్ని వాయించడం, వంట చేయడం వంటివి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
చెడు అలవాట్లు వద్దు: -ఒత్తిడిని తగ్గించుకోవడానికి డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకోవడం, మొబైల్ వాడటం వల్ల ఆరోగ్యం పాడవడంతోపాటు దీర్ఘకాలంలో ఆ అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి.
ఇతరులతో పంచుకోండి: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పలు మార్గాలు అవసరం. తమకు ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను తోటి విద్యార్థులతో పంచుకోవడం ద్వారా విద్యార్థులు వాటిని సులభంగా పరిష్కరించుకోగలరు. దీని వల్ల తాము ఒంటరికాదన్న భావం ఏర్పడుతుంది. విద్యాసంస్థలోనే సామాజిక కార్యకర్తలు, కౌన్సెలర్లతో ఒక సహాయక బృందం ఉంటే విద్యార్థులు సులభంగా వారి సహాయాన్ని పొందుతారు.
అలాంటి సదుపాయం ఉంటే వి ద్యార్థికి ఆ విద్యాసంస్థ పట్ల వ్యతిరేకత తగ్గుతుంది. విద్యార్థులు తమ సమస్యలను ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛ గా తల్లిదండ్రులతో పం చుకోగలిగే అవకాశం ఉండాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మధ్య సంభాషణ కేవలం చదువు, పరీక్షల గురించి మాత్రమే ఉండకూడదు.
ప్రత్యామ్నాయ అవకాశాలు: చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లాడు- చదువులో ఫస్ట్ రావాలని, ఏదో ఒక కాలేజీలో సీటు రావాలని, ఎంట్రన్స్ పరీక్షలో పాస్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. ప్రత్యామ్నాయ ఆలోచన లేకపోవడం వల్ల అది కాకుంటే ఇంకేదీ లేదనే నిరాశాపూరిత దృక్పథం ఏర్పడుతుం ది. చాలా మంది ప్రత్యామ్నా య అవకాశాల గురించి ఆలోచించకుండా, ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటారు. దీని వల్ల ఒత్తిడి పెరి గి, ప్రతికూల ఫలితాలకు కారణమవుతుంది.
నిద్రలో రాజీవద్దు: ఆరోగ్యంగా ఉండేందుకు కచ్చితంగా సరిపడా నిద్ర పోవాలి. కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే అరగంట ముందు నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచుకోవాలి. ఫలితంగా నాణ్యమైన నిద్రతో జ్ఞాపకశక్తి మెరుగవడంతోపాటు చురుగ్గా ఉంటారు.
పౌష్ఠికాహారం పక్కా: ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. అన్ని పోషకాలు సమృద్ధిగా లభించే సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. పోషకాహారం తీసుకోవడం ద్వారా కొంతమేరకు ఒత్తిడిని నియంత్రించవచ్చు. గుడ్లు, గుమ్మడిగింజలు, పెరుగు, చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
తల్లిదండ్రులు ఏం చేయాలంటే?
ఓవైపు ఎండలు, ఇంకోవైపు పిల్లల్లో పరీక్షల ఒత్తిడి. ఈ నేపథ్యంలో పిల్లలు ఆందోళన, ఒత్తిళ్లకు గురికాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల దైనందిన జీవితంలో మార్గదర్శకులుగా మారడమనేది అత్యంత అవసరం. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఏం చేయాలంటే..
* పరీక్షల ఫలితాలు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవని పిల్లలకు చెప్పండి. అప్పుడే వారు మంచి మార్కులు సాధించడంలో విజయం సాధిస్తారు.
* వాళ్లు చక్కగా చదవడానికి ప్రశాంతమైన వాతావరణం అందించండి. టీవీ, ఫోన్ వంటి ఆటంకాలను తగ్గించండి.
* పరీక్షల సమయంలో పిల్లలు సరైన ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం చాలా ముఖ్యమని వారికి గుర్తు చేయండి. వీటిని పాటించడంలో వారికి సహాయం చేయండి.
* వారి పనితీరు పట్ల శ్రద్ధ వహించడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.
* పరుగు పోటీ భావనను పిల్లలకు కలిగించకండి. ప్రతి పిల్లవాడి ప్రత్యేకతను గుర్తించి వారిని అందుకు ప్రోత్సహించండి.
ఇతరులతో పోల్చొద్దు
పిల్లలకు ఒత్తిడికి అనేక కారణాలుంటాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, ఇన్‌స్టిట్యూట్, సీనియర్స్ నుంచి అనేక రకాలుగా ఒత్తిడి ఉంటుంది. ఇతరుల కంటే ఎక్కువగా మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు, సీనియర్స్ కంటే మంచి ర్యాంకులు సాధించాలని స్కూల్ మేనేజ్‌మెంట్స్ ఒత్తిడి తెస్తుంటాయి. వాళ్ల ఉద్దే శం మంచిదే కావొచ్చు.
కానీ ర్యాంకులు, మార్కుల పేరుతో పిల్లాడ్ని నిరంతరం ఒత్తిడిలోకి నెట్టేయడం మానుకోవాలి. ఓ పిల్లాడు మొబైల్‌తో ఎక్కువగా గడిపినా, అదే పనిగా ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకున్నా కచ్చి తంగా ఒత్తిడి బారిన పడినట్టుగా గుర్తించాలి. అలాంటప్పు డు వాళ్లలో భయాన్ని దూరం చేయాలి. ఎప్పుడూ పుస్తకాల తో కుస్తీ పడుతుంటే.. తల్లిదండ్రులు చొరవ తీసుకొని విశ్రాం తి ఇవ్వాలి.
ఎలా చదవాలి? ఏవిధంగా చదవాలి? అనే ప్రణాళికను పిల్లలతోనే చర్చించాలి. చాలామంది తల్లిదండ్రులు తాము టీవీ చూస్తూ.. పిల్లలను చదుకోవాలని ఒత్తిడి తెస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదు. పరీక్షల సమయంలో పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకే స్నేహితుల మాదిరిగా సాయం చేయాలి.
వీరేందర్ చెన్నోజు
సైకాలజిస్ట్
‘యూ అండ్ మీ’ కౌన్సెలింగ్ సెంటర్
హైదరాబాద్