calender_icon.png 2 February, 2026 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్వతాలు తలవంచేలా!

16-02-2025 12:00:00 AM

17 ఏళ్లకే ఏడు పర్వతాలెక్కింది!

‘పర్వతాలు పిలుస్తాయి వెళ్లాలి’ అంటారు పర్వతారోహకులు. మనకున్న ఎన్నో అభిరుచుల్లో పర్వతారోహణ ఒకటి. చిన్న గుట్టలతో మొదలయ్యే హాబీ కొండలకు, పర్వతాలకు ఎదిగి చివరకు‘ఎవరెస్ట్’ అధిరోహించడంతో ముగుస్తుంది.ట్రెక్కింగ్ చేసేవారు జీవితంలో ఒక్కసారైనా పర్వతారోహణ చేయాలని కోరుకుంటారు. కొంతమంది ఏడు ఖండాల్లోని ప్రతి ఎత్తున పర్వతాన్ని అధిరోహించాలనుకుంటారు. ఇంతకూ పర్వతారోహణ వల్ల ఏమవుతుంది? దాని వల్ల పిల్లలకు లాభాలేంటి? అనే విషయాలు తెలుసుకుందాం.. 

పర్వతాలు ఎక్కే క్రమంలో ప్రకృతి పెట్టే పరీక్షలను ఓర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శిఖరం వరకూ చేరాక భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది.  ‘పర్వతం వంటి వ్యక్తి’, ‘శిఖరం లాంటి వ్యక్తి’ అని కొందరిని పోలుస్తారు.

అంటే ఏ రంగాన్ని అయితే ఎంచుకుం టారో ఆ రంగంలోవారు అత్యున్నత విజయా న్ని సాధించినవారన్నమాట. శాస్త్రవేత్తలలో ఐన్‌స్టీన్ శిఖరం వంటి వాడు. సినిమా నటులలో అమితాబ్ బచ్చన్ శిఖరం వంటి వాడు. మనం ఒక చిత్రకారులం కావాలనుకుంటే పికాసో అంతటివాళ్లం కావాలని లక్ష్యం పెట్టుకోవాలి. అలాంటి స్ఫూర్తి పర్వతారోహణ వల్ల కలుగుతుంది. 

* అబ్బాయిల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదు అని ఆత్మవిశ్వాసం తెచ్చుకోవడానికి అమ్మాయిలకు కూడా పర్వతా రోహణ ఒక మంచి మార్గం. పర్వతారోహణలో వీపు వెనుక బరువు వేసుకుని ఎక్కాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనడం పెద్ద కష్టం కాదని ఈ కష్టం పడినప్పుడు తెలుస్తుంది. పర్వతారోహణలో పొదుపు తెలు స్తుంది.

తీసుకెళ్లిన ఆహారాన్ని పొదుపుగా వాడుకో వాలి. నీళ్లను పొదుపుగా వాడుకోవాలి. జీవితంలో కూడా ఉన్న నిధులను ఎలా జాగ్రత్త చేసుకోవాలో దీని వల్ల తెలుస్తుంది. అలాగే అహం (ఇగో) కొన్నిసార్లు మేలు చేస్తుంది. కొన్నిసార్లు హాని చేస్తుంది. అంత ఎత్తయిన పర్వతం మౌనంగా ఉన్నప్పుడు ఆరడుగుల మనిషి ఎందుకు మిడిసి పడాలి. ఎదిగేకొద్దీ వొదగడం పర్వతం నేర్పిస్తుంది. 

* ఉదయాన్నే లేచి స్కూల్‌కు వెళుతున్నాం, ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్నాం అనుకుంటాంగాని కొండనో పర్వతాన్నో ఎక్కితేనే మనం ఎంత ఫిట్ ఉన్నామో తెలుస్తుంది. మన  మోకాళ్లు, పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో పర్వతారోహణ తెలియచేస్తుంది. ఈ అలవాటును ఫాలో అయ్యేవారు ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరిన్ని పర్వతాలు ఎక్కేం దుకు మరింత ఫిట్‌గా ఉంటారు. కాబట్టి పర్వతారోహణ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచు తుంది. 

* - మహారాష్ర్టకు చెందిన 17 ఏళ్ల కామ్యా కార్తికేయన్. ఒకటి కాదు, రెండు కాదు.. ఏడు ఖండాల్లో ఏడు ఎత్తున శిఖరాల్ని అధిరోహించి.. పర్వతారోహణలోనే ప్రతిష్టాత్మకంగా చెప్పుకొనే ‘7 సమిట్ ఛాలెంజ్’ను ఇటీవలే పూర్తి చేసింది. తద్వారా ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది. 

మూడేళ్ల వయసులోనే.

కామ్యది తండ్రి ఎస్. కార్తికేయన్ భారతీయ నావికా దళంలో కమాండర్‌గా పని చేస్తున్నారు. ఆయన వృత్తిరీత్యా గత కొన్నేళ్లుగా మహారాష్ర్టలో ఉంటున్నారు. ముంబ యి, పుణేల మధ్య ఉన్న హిల్ స్టేషన్ ఇది. పచ్చటి ప్రకృతికి, ట్రెక్కింగ్‌కి స్వర్గధామమైన ఈ ప్రదేశమే తాను పర్వతారోహణతో ప్రేమలో పడేలా చేసింది. 

‘మా నాన్నకు సాహసాలంటే ప్రాణం. ఈ ఇష్టంతోనే నాకు మూడేళ్ల వయసున్నప్పుడు తన నేవీ బృందంతో కలిసి తరచూ పర్వతారోహణకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే నెలల తర బడి ఇంటికి దూరంగా ఉండేవారు. ‘అమ్మా.. నాన్న ఎందుకు మనల్ని వదిలి పర్వతారోహణకు వెళ్తున్నారు? అంతగా ఆ పర్వతాల్లో ఏం మహత్తు దాగుంది?’ అని ఓ రోజు అమ్మను అడిగా.

‘అదేంటో నీ ప్రయత్నంతో నువ్వే తెలుసుకో..’ అంది అమ్మ. దాంతో నాకూ పర్వతా లెక్కాలన్న మక్కువ కలిగింది. ఏడేళ్లొచ్చాక అమ్మానాన్నలతో కలిసి ఉత్తరాఖండ్‌లోని చంద్రశిల పర్వతంపైకి ట్రెక్కింగ్‌కు వెళ్లా. ఈ సాహసం, అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం నాకెంతో నచ్చాయి. ఇక అప్పట్నుంచి ఏటా పర్వతారోహణే నా వెకేషన్‌గా మారిపోయింది’ అంటోంది కామ్య.

సాహసమే ఊపిరిగా..

ఇలా చిన్న వయసులోనే పర్వతారోహణ ను తన ప్రవృత్తిగా చేసుకున్న కామ్య..  ఎవరె స్ట్ బేస్ క్యాంప్‌పైకి చేరుకుంది. ఆపై ఉత్తరాఖండ్‌లోని కేదార్‌కాంతా, రూప్‌కుండ్ సరస్సు.. తదితర ఎత్తున శిఖరాలను అధిరోహించి తన  ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకుంది. ఈ క్రమంలోనే ‘7 సమిట్ ఛాలెంజ్’పై కన్నేసింది కామ్య.

ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు ఎత్తున శిఖరాల్ని అధిరోహించాలని ల క్ష్యంగా పెట్టుకున్న ఆమె.. తన 13 ఏళ్ల వయసులో ఆఫ్రికాలోని ‘మౌంట్ కిలిమంజారో’ ప ర్వతారోహణతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసే దిశగా తొలి అడుగు వేసింది.

‘సాహస్’గా తన యాత్రకు పేరు పెట్టుకున్న కామ్య.. ఆపై వరుసగా యూరప్‌లోని ‘మౌంట్ ఎల్బ్రస్’, ఆస్ట్రేలి యాలోని మౌంట్ కోజిస్కో, దక్షిణ అమెరికాలోని ‘మౌంట్ ఆకొన్‌కాగ్వా’, ఉత్తర అమెరి కాలోని ‘మౌంట్ డెనాలీ’, ఆసియాలోని ‘మౌంట్ ఎవరెస్ట్’ శిఖరాల్ని అధిరోహించింది.

ఇక ఇటీవలే అంటార్కిటికాలోనే ఎత్తున శిఖరమైన ‘మౌంట్ విన్సన్’ శిఖరాగ్రానికి చేరుకుం ది. ఇలా నాలుగేళ్లలోనే ‘7 సమిట్ ఛాలెంజ్’ పూర్తి చేసింది 17 ఏళ్ల కామ్య. ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ఈ ఛాలెంజ్ పూర్తి చేసిన అమ్మాయిగా చరిత్రకెక్కింది.