11 March, 2026 | 4:37 AM

ఇండ్ల పంపిణీ అటకెక్కినట్లేనా?

11-03-2026 01:12 AM

ఆశల పల్లకిలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు

దరఖాస్తులు ఏమయ్యాయి..?

ఇండ్ల కోసం ఎదురు చూపులు 

పారదర్శకతపై అనుమానాలే..

దరఖాస్తులు స్వీకరించి నెలలు గడుస్తున్న ఇప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు మాత్రం ఆచరణ రూపం దాల్చలేదు. లబ్ధిదారులు మాత్రం ఇండ్ల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.  స్వీకరించిన దరఖాస్తుల వివరాలను అధికారులు వెల్లడించనూలేదు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికను కూడా అధికారులు గోప్యంగానే ఉంచారు. అసలు లబ్ధిదారుల లిస్టు తయారైందో.. లేదో..! అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇండ్ల పంపిణీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా ఉండిపోయింది.

బెల్లంపల్లి, మార్చి 10: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్మితమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ ఇళ్లను పంపిణీ చేసేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో పేద ప్రజలకు గృహ నిర్మాణ సదుపాయం కోసం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని చేపట్టారు.

కన్నాల ప్రధాన రహదారి పక్కన అప్పటి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శ్రీకారం చుట్టింది. అప్పటి మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తొలి విడతగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపనతో నాంది పలికారు. మొదటి విడతలో భాగంగా బెల్లంపల్లికి 260 ఇండ్లను మంజూరు చేశారు. 2018లో చేపట్టిన ఈ ఇండ్ల నిర్మాణాలు ఇప్పటికీ నత్త నడకలోనే సాగుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో చేతికందుతాయనీ లబ్ధిదారులు ఎంతో ఆశపడ్డా, వారి అశలు అడియాశలయ్యాయి.

ఇంతలోఎన్నికలు రానేవ చ్చాయి. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కూడా ఈ ఇళ్ల నిర్మాణం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇండ్లు పూర్తి నిర్మాణానికి నోచుకోలేకపోయాయి. ఆశల పల్లకిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఊరేగుతున్నాయి. పంపిణీలో నెలకొన్న తీవ్రజాప్యం వెరసి లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తిని గూడుకట్టుకున్నది. సంబంధిత కాంట్రాక్టర్, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లోపం వెరసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నత్తనడకలో సాగుతున్నాయి.

ఈ జాడ్యం అప్పటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నుంచి మొదలుకొని ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వినోద్ వరకు కొనసాగుతూనే ఉన్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు పట్టిన గ్రహణం ఎంతకీ వీడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన  లబ్ధిదారుల్లో ఎంతమందికి దక్కుతాయో అనే చర్చ జోరుగా జరుగుతుంది. ఇండ్ల పంపిణీ న్యాయ బద్ధంగా జరుగుద్దని ఎవరి కీ కాసింత నమ్మకం లేని పరిస్థితీ కనిపిస్తోంది.

ఈ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైరవీలు, అధికార ప్రభావం, ఆశ్రిత పక్షపాతానికి ఎన్ని ఇండ్లు దారి తప్పుతాయోననే అనుఅనుమానాలు లేకపోలేదు. పుట్టడు అనుమాల నేపథ్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఏ మేరకు పారదర్శకత, ప్రమాణికత ప్రకారం జరుగుతాయో అనేది ప్రశ్నార్థకం అనే అభిప్రా యా లు ఉన్నాయి. ఏదేమైనా త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.