భగ్గుమన్న బెంగాల్ అభిమానులు
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి పర్యటన తొలి అడుగులోనే వివాదం
- కోల్‌కతా స్టేడియంలోకి మెస్సి ప్రవేశించిన ౧౦ నిమిషాలకే రిటర్న్
రాజకీయ నేతలు, యంత్రాంగం చుట్టుముట్టడమే కారణం
భద్రతా కారణాల వల్ల వెనుదిరిగిన మెస్సి బృందం
కట్టలు తెంచుకున్న అభిమానుల ఆగ్రహం
మైదానంలోకి కుర్చీలు విసిరి.. హోర్డింగ్‌లు ధ్వంసం చేసి నిరసన
పోలీసుల లాఠీచార్జి.. ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా అరెస్ట్
సాకర్ అభిమానులకు క్షమాపణలు: బెంగాల్ సీఎం మమత
కోల్‌కతా, డిసెంబర్ 13: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ‘గోట్ ఇండియా టూర్ 2025’ తొలి అడుగులోనే వివాదంలో చిక్కుకుంది. కోల్‌కతాలోని వివేకా నంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంలోకి మెస్సి బృందం ప్రవేశించిన పది నిమిషాలకే వెనుదిరగడంపై అభిమానులు భగ్గుమన్నారు. వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. మైదానంలోకి కుర్చీలు విసిరి నిరసన వ్యక్తం చేశారు. హోర్డింగ్‌లు ధ్వంసం చేసి నిర్వాహకులను నిలదీశారు.
పోలీసులు ఒక దశలో ఆందోళనకారులపై లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మెస్సి కోసం ఏర్పాటు చేసిన ‘ల్యాప్ ఆఫ్ హానర్’ కార్యక్రమం సైతం సక్రమంగా జరగలేదు. మెస్సి స్టేడియంలోకి ప్రవేశించగానే అప్పటికే స్టేడియంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రముఖులు, అధికారులు, వారి పరివారం ఒక్కసారిగా ఆయ న్ను చుట్టుముట్టారు. దీంతో అభిమానులు మెస్సిని చూడటం కష్టతరమైంది.
అభిమానుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవ డంతో భద్రతా సిబ్బంది ఆ తర్వాతి కార్యక్రమాలను అనివార్యంగా నిలిపివేయాల్సి వచ్చింది. స్టేడియంలో అడుగుపెట్టిన పది నిమిషాల్లోనే మెస్సి వెనుదిరగడంతో అభిమానులు నిరాశ చెందారు. మెస్సిని చూసేం దుకు తాము ఎంతో ఆశగా స్టేడియానికి వచ్చామని, తెల్లవారుజాము నుంచి ఆయన కోసం ఎదురుచూశామని వాపోయారు.
వేలకు వేలు పెట్టి టిక్కెట్లు కొని కూడా, కనీసం మెస్సిని చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీమియం ధరలు చెల్లించి మరీ టిక్కెట్లు కొన్నామని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. కోపంతో ఊగిపోయిన కొందరు అభిమానులు మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరారు. స్టేడియంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడి శతద్రు దత్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అభిమానులు టికెట్ల డబ్బులు సైతం తిరిగి చెల్లించాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు నిర్వాహ కుడు టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్‌కుమార్ స్పందిస్తూ.. ఘటనకు బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాంస్య విగ్రహావిష్కరణ
కోల్‌కతాలో ఏర్పాటు చేసిన 70 అడుగుల మెస్సి విగ్రహాన్ని వర్చువ ల్‌గా మెస్సి ప్రారంభించాల్సి వచ్చింది. వాస్త వానికి ఆయనే స్వయంగా అక్కడికి వెళ్లి విగ్రహావిష్కరణ చేయాల్సి ఉంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమత, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ తదితరులు ఉన్నారు. ఈ సమయంలో షారుఖ్ ఖాన్ తన పిల్లలతో కలిసి మెస్సితో ఫొటోదిగి స సందడి చేశారు.
నిర్వహణపరమైన వైఫ్యలాలే కారణం: బీజేపీ
టూర్ ఫ్లాప్‌పై బీజేపీ శ్రేణులు అధికార పార్టీ టీఎంసీపై విరుచుకుపడ్డాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర బీజేపీ విభాగం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘మమత ప్రభుత్వం పూర్తిగా వైఫ్యలం చెందింది. పెద్ద మొత్తంలో వసూలు చేసి చివరకు అభిమానులను నిరాశ పరిచారు. ఇది పెద్ద కుంభకోణం. రాష్ట్ర క్రీడా మంత్రి ఆరూప్ తక్షణం రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది.
విచారణకు ఆదేశిస్తున్నాం
స్టేడియంలో జరిగిన ఉద్రిక్తతలపై సాకర్ ప్రియులు, మెస్సి అభిమానులకు రాష్ట్రప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్తున్నాం. భద్రతాపరమైన కారణాలతోనే మెస్సీ తన తదుపరి కార్యక్రమాలను రద్దు చేయాల్సి వచ్చింది. నిర్వహణ వైఫల్యాలు కలచివేశాయి.
స్టేడియంలో ఉద్రిక్తతలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నాం. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆశిమ్‌కుమార్ రే ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తాం. విచారణ అనంతరం కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తపడతాం. మమతా బెనర్జీ, బెంగాల్ సీఎం
నిర్వాహకుడిని అరెస్ట్ చేయించాం.
క్రీడాభిమానులకు ఇదొక చీకటి రోజు. నిర్వహణ లోపాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఉద్రిక్తతలకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోని పోలీసు అధికారులనూ సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నాను.
వైఫల్యాలపై తక్షణం విచారణ జరిపి, దోషులను అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. నిర్వాహకుడు శతద్రు దత్తాను సైతం అరెస్టు చేయించాం. అభిమానులకు రీఫండ్ చెల్లించాలని ఆదేశించాం. స్టేడియంతోపాటు ఇతర చోట్ల జరిగిన నష్టానికి నిర్వాహకులకు పోలీస్‌శాఖ జరిమానా విధించాలి.
సీవీ ఆనంద బోస్, బెంగాల్ గవర్నర్
అంతా మోసం: ఓ అభిమాని ఆవేదన
స్టేడియం నిండా రాజకీయ నేతలు, మంత్రులు, కార్పొరేట్ శక్తులు మాత్రమే ఉన్నారు. వారే మెస్సిని చుట్టుముట్టారు. మెస్సి మైదానంలోకి దిగి రెండు మూడు నిమిషాలైన ఫుట్‌బాల్ ఆడతారని ఆశపడ్డాం. అది జరగలేదు. నిర్వాహకులు బాలీవుడ్ స్టార్స్ కూడా స్టేడియానికి వస్తారని చెప్పారు. అది కూడా జరగలేదు. నిర్వాహకులు మమ్మల్ని మో సం చేశారు. మా డబ్బు, సమయం అంతా వృథా అయ్యాయి’ ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.




