ప్రజలకు ఆషాడ మాస బోనాల శుభాకాంక్షలు
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు నేడు(జూలై 16) ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, జంట నగరాల భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని, ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవం అని చెప్పారు.
నేటి నుంచి (జూలై 16) నుంచి ప్రారంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, -మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు మూడు వేలకు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఎం వివరించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు, తెలంగాణ గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి నిలువెత్తు నిదర్శమని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయని సీఎం వెల్లడించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.






