04-02-2026 01:10:42 AM
కలెక్టర్ కె.హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఆమె వివిధ వార్డులు, విభాగాలను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగు లతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
రక్త నిల్వ గదిని పరిశీలించిన అనంతరం వైద్యులు, నర్సులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో సామాన్యులు, గిరిజనులు ఎక్కువగా ఉంటారని, వారి పట్ల మర్యాదతో వ్యవహరించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సమయపాలన పాటించాలని ఆదేశించారు.
ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, శుద్ధమైన తాగునీరు అందించాలని తెలిపారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుబోధ్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.