2 June, 2026 | 2:43 AM

జేబుదొంగలున్నారు జాగ్రత్త!

02-06-2026 12:00 AM
  1. సీబీఎస్‌ఈలో కాచుకుని కూర్చున్నారు
  2. బోర్డులో లోపాలు జరిగినా బిల్లు విద్యార్థులకే
  3. ప్రధాని మోదీకి మామిడి పండ్ల గురించి మాట్లాడే తీరక ఉంది..
  4. బోర్డు తప్పుల గురించి మాట్లాడే తీరిక మాత్రం లేదు..
  5. ‘ఎక్స్’ వేదికగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ చురకలు

న్యూఢిల్లీ, జూన్ ౧: ‘జేబుదొంగలు ఉన్నా రు జాగ్రత్త. వారంతా సీబీఎస్‌ఈ కార్యాలయంలో కాచుకుని కూర్చున్నారు. బోర్డులో లోపాలు జరిగితే మీ జేబుకు చిల్లు పెడతారు. మీకు బిల్లు అంటగడతారు. డిజిటల్ స్కాన్ కాపీ కావాలంటే ఒక సబ్జెక్ట్‌కు రూ. 100, ఒక పేపర్ రీటోటలింగ్‌కు రూ.100, రీవాల్యుయేషన్‌లో ఒక ప్రశ్నకు రూ.25 చొప్పున వసూలు చేస్తారు. అలా.. మొత్తం గా ఒక విద్యార్థి తన జవాబుపత్రాన్ని సరిగా దిద్దించుకోవాలంటే రూ.2,000 చెల్లించాలి.

దేశవ్యాప్తంగా 4 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే, బోర్డు ఎంతమొత్తంలో సొమ్ము దండుకుంటుందో అర్థం చేసుకోవచ్చు’ అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలు సీబీఎస్‌ఈకు దోపిడీకి ఉపయోగపడుతున్నాయని దుమ్మెత్తిపోశారు. టెండర్ నిబంధ నలను మార్చి ఒక ప్రైవేట్ విద్యా టెక్ సంస్థ కు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు.

జవాబు పత్రాలను స్కాన్ చేసేందుకు ప్రొఫెషనల్ స్కానర్లకు బదులుగా మొబైల్ ఫోన్లు వాడారని తెలిపారు. దీనివల్ల 18.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోపా లను మొదట నిరాకరించిన సీబీఎస్‌ఈ ఆ తర్వాత అంగీకరించిందని పేర్కొన్నారు.  సదరు ప్రైవేట్ సంస్థపై టెండర్ నిబంధనల ప్రకారం జరిమానా విధించేందుకు సీబీఎస్ సిద్ధమవుతున్నట్లు తెలిసిందన్నారు.

బోర్డు చేసిన తప్పులకు విద్యార్థులు మూల్యం చెల్లించాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. అయినా.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని, మామిడి పండ్ల గురించి మాట్లాడే ప్రధాని మోదీకి సీబీఎస్‌ఈ లోపాలపై మాట్లాడే తీరిక లేదని దు య్యబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.