2 June, 2026 | 2:42 AM

డీఎంకే, ఏఐడీఎంకే చరిత్ర హస్తగత సమాప్తం

02-06-2026 12:00 AM
  1. కుటుంబ రాజకీయాలే ఆ పార్టీలను ముంచాయి..
  2. తమిళనాడు సీఎం విజయ్ తీవ్ర విమర్శలు
  3. త్రిచి ఉప ఎన్నికల సభలో ఘాటు వ్యాఖ్యలు

చెన్నై, జూన్ ౧: డీఎంకే, ఏఐడీఎంకే చరిత్ర హస్తగత సమాప్తమైందని, కుటుంబ రాజకీయాలే ఆ పార్టీలను ముంచేశాయని తమిళ నాడు సీఎం విజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి బహిరంగ సభకు హాజరయ్యారు. ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవా రం త్రిచిలో నిర్వహించిన టీవీకే సభలో ఆయన రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు. తమ ఏఐడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొంటున్నదన్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపడేశారు.

ఆయా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలో చేరారని గుర్తుచేశారు. ప్రజల తమ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారని, తమకు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీఎంగా తాను బాధ్యతలు చేపట్టి కొన్ని వారాలు మాత్రమే అయిందని, ఆరు నెలల పాటు తమ పాలనను సైలెంట్‌గా గమనిస్తామన్న వారు, అప్పుడే తమపై విమర్శలు మొదలుపెట్టారని డీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరగడానికి గత డీఎంకే ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. వారి హయాంలోనే డ్రగ్స్ సంస్కృతి విస్తరించిందని ధ్వజమెత్తారు. ఆ ప్రభుత్వం ప్రారంభంలోనే డ్రగ్స్ మహమ్మారిని అణచివేసి ఉంటే, ఈరోజు మహిళలు, పిల్లలు ఇంతగా ఇబ్బంది పడేవారు కాదని అభిప్రాయపడ్డారు. తప్పులన్నీ డీఎంకే చేసి ఇప్పుడా నిందను తమ ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మతం, కులం, కరెన్సీ నోట్ల అడ్డుగోడలను బద్దలు కొట్టి తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు అవినీతి, అరాచకాలకు తావులేని పాలన అందిస్తామని పేర్కొన్నారు. తాను డ్రెస్సింగ్ స్టుల్‌పై వస్తు న్న విమర్శలకూ సీఎం విజయ్ కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నవారు, పెత్తందారులు మాత్రమే సూట్ వేసుకోవాలా? అని విమర్శకులను ప్రశ్నించారు.

సూట్ ధరించడం అధికారంలో ఉన్నవారికి మాత్రమే పరిమితమైన హక్కు కాదని, ప్రతిఒక్కరూ తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని చెప్పుకొచ్చారు. తానేమీ రంగు రంగుల సూట్లు వేసుకోవడం లేదని, కేవలం నలుపు, తెలుపు రంగుల సూట్స్ మాత్రమే ధరిస్తున్నట్లు వెల్లడించారు. తన రాజకీయాలు కూడా బ్లాక్ అండ్ వైట్ లాగా స్పష్టంగా ఉంటాయని స్పష్టం చేశారు.